మణిపూర్ లో 12 మంది తీవ్రవాదులను విడిపించుకున్న మహిళలు

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో కంగ్లీ యావోల్ కన్న లుప్ (కేవైకేఎల్) మైతీ మిలిటెంట్ గ్రూప్‌ సభ్యులు దాక్కున్న ఇంఫాల్ ఈస్ట్‌లోని ఇథమ్ గ్రామాన్ని శనివారం భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ సమయంలో మహిళల నేతృత్వంలోని అల్లరి మూక సైన్యానికి అడ్డుగా నిలిచింది.  దీంతో పౌరుల ప్రాణాలను పణంగా పెట్టకుండా సైన్యం పరిణతి ప్రదర్శించింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న సైన్యం మిలిటెంట్లను వదిలిపెట్టింది. ఆయుధాలు, మందుగుండుతో నిండి ఉన్న పలు ఇళ్లను కూడా ఆర్మీ సీజ్ చేసింది
12 మంది మిలిటంట్లను అరెస్ట్ చేసారినై తెలియడంతో దాదాపు 1500 మంది గుంపు వచ్చి ఇండియన్ ఆర్మీ స్పియర్ కార్ప్స్ దళాన్ని చుట్టుముట్టింది.. ముందు వరుసలో మహిళలు, ఒక స్థానిక నాయకుడు ఉన్నాడు. ఆర్మీ అరెస్ట్ చేసిన 12 మంది మిలిటెంట్లను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆర్మీ ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు.

ఇంత పెద్ద జన సమూహంపై కాల్పులు జరిపితే ప్రాణనష్టం జరిగే ముప్పు ఉంటుందనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఆర్మీ 12 మంది మిలిటెంట్లను వారికి అప్పగించింది. శనివారం రోజు జరిగిన ఈ ఘటన ఆర్మీ ట్విట్టర్ వేదికగా చేసిన ప్రకటనతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైతీ మిలిటెంట్ గ్రూప్ 2015లో 6 డోగ్రా యూనిట్‌పై దాడి సహా అనేక దాడుల్లో పాల్గొందని అధికారులు తెలిపారు.

ఇథమ్‌లో ప్రతిష్టంభన శనివారం అంతటా కొనసాగింది. మహిళల నేతృత్వంలోని గుంపుపై బలప్రయోగం, ఆ చర్య కారణంగా ప్రాణనష్టం జరగడం వంటి సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కమాండర్ పరిణతి చెందిన నిర్ణయంతో ప్రతిష్టంబన ముగిసిందని చెప్పారు. గ్రామంలో దాక్కున్న వారిలో డోగ్రా మెరుపు దాడికి ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మొయిరంగ్థెం తంబ అలియాస్ ఉత్తమ్ కూడా ఉన్నారని తెలిపారు.

మహిళల నేతృత్వంలోని 1,500 మంది గుంపు సైన్యాన్ని చుట్టుముట్టి, ముందుకు వెళ్లకుండా అడ్డుకుందని వివరించారు. చట్టం ప్రకారం భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగించడానికి అనుమతించమని అల్లరి మూకకు పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ ఎటువంటి సానుకూల ఫలితం రాలేదు అని అధికారులు పేర్కొన్నారు.  ‘మణిపూర్‌లో కొనసాగుతున్న అశాంతి సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని సైన్యం వెనక్కి తగ్గాలని నిర్ణయం తీసుకుంది’ అని అధికారులు చెప్పారు.