భారీ వర్షాలతో కేదార్‌నాథ్‌ యాత్ర నిలిపివేత

దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రుద్రప్రయాగ్‌ జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో కేదార్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిలిపివేసింది.  తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు యాత్రను నిలిపివేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని రుద్రప్రయాగ్‌ కలెక్టర్‌ దీక్షిత్‌ తెలిపారు. 
ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే యాత్ర కోసం బయలుదేరిన పర్యాటకులను సోన్‌ ప్రయాగ వద్ద నిలిపివేశారు. వారికి తాత్కాలికంగా వసతి కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఇదిలా ఉండగా, వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో హరిద్వార్‌లో 78 మిల్లీ మీటర్లు, డెహ్రాడూన్‌లో 33.2 మిల్లీ మీటర్లు, ఉత్తరకాశీలో 27.7 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైనట్లు వాతావరణశాఖ పేర్కొంది. రాబోయే కొద్ది రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 
మరో వైపు వర్షాలపై ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి సమీక్షించారు. సచివాలయంలో ఉన్న రాష్ట్ర విపత్తు నిర్వహణ నియంత్రణ గదిని ఆకస్మికంగా తనిఖీ చేసి, భారీ వర్షాల పరిస్థితిపై అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షాల పరిస్థితి, నీటి ఎద్దడి, వర్షాల కారణంగా జరిగిన నష్టంపై అధికారుల నుంచి సమాచారం సేకరించారు.
 
 రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మరో వైపు ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డెహ్రాడూన్, నైనిటాల్, చంపావత్, పితోర్‌గఢ్, బాగేశ్వర్, డెహ్రాడూన్, తెహ్రీ, పౌరి జిల్లాల్లకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.
 
కాగా, రాగల రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, జార్ఖండ్‌, గంగేటిక్‌ పశ్చిమబెంగాల్‌, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల రెండు మూడు రోజుల్లో అతివృష్టి కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
 
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా హిమాచల్‌ప్రదేశ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచన ఉంది.