రెండు అతి పెద్ద దేశాల బంధం ఇలాగే కొనసాగుతుంది

 
“భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది. ఆధునిక ప్రజాస్వామ్యానికి అమెరికా ఒక ఛాంపియన్​. ఈరోజున.. రెండు అతిపెద్ద దేశాల స్నేహాన్ని ప్రపంచం మొత్తం చూస్తోంది. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది,” అంటూ మూడు రోజుల అమెరికా పర్యటన ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
వాషింగ్టన్​లోని కెన్నడీ సెంటర్​లో జరిగిన యూఎస్​ఐఎస్​పీఎఫ్​ ఈవెంట్​లో ప్రధాని పాల్గొన్నారు. వందలాది మంది భారత సంతతి అమెరికాన్లు ఈ ఈవెంట్​కు హాజరయ్యారు. మోదీ మాట్లాడుతున్న ప్రతిసారి.. చప్పట్లతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. భారతీయ సంఘాలతో సమావేశానికి ముందు పలు పెట్టుబడిదారులు, వివిధ సంస్థల సీఈఓలతో మోదీ సమావేశమయ్యారు,
 
ప్రధానిని కలిసిన అనంతరం గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ కీలక ప్రకటన చేశారు. గుజరాత్​లో గూగుల్​కు చెందిన ఫిన్​టెక్​ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. డిజిటల్​ ఇండియాపై మోదీ విజన్​ను ఆయన కొనియాడారు. “ప్రత్యేకమైన అమెరికా పర్యటన ముగిసింది. అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను కలిసి భారత్​- అమెరికా స్నేహాన్ని మరింత పెంపొందించే అవకాశం నాకు దక్కింది. ప్రపంచాన్ని మెరుగైన స్థానానికి తీసుకెళ్లేందుకు మా రెండు దేశాలు కృషి చేస్తాయి,” మోదీ తన పర్యటనపై ట్వీట్​ చేశారు.
 
మైనారిటీలపై వివక్ష లేదు

అంతకు ముందు భారత్‌లో మైనారిటీలపై వివక్ష లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లు సంయుక్తంగా మీడియా సమావేశంలో భారత్‌లో మైనారిటీలపై వివక్ష కొనసాగుతోందని, ప్రశ్నించినవారి గొంతుకలను అణిచివేసేందుకు యత్నిస్తుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. భారత్‌లో మైనారిటీలపై వివక్ష లేనేలేదని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

మైనారిటీలపై వివక్ష వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ భారత్‌, అమెరికాల డిఎన్‌ఎలోనే ప్రజాస్వామ్యం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యలను ఉటంకించారు. ”ప్రజాస్వామ్యం మన ఆత్మలో ఉంది. ప్రజాస్వామ్యం మన రక్తంలోనే ఉందని, మనం ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాం” అని తెలిపారు.

మన పూర్వీకులు ప్రవేశపెట్టిన ఈ భావనను మన రాజ్యాంగంలో పొందుపరిచామని, భారతదేశం ప్రజాస్వామ్యయుతంగానే నడుస్తోందని తేల్చి చెప్పారు. మావన విలువలు, మానవ హక్కులను కాపాడకపోతే ప్రజాస్వామ్యమే లేదని స్పష్టం చేశారు. కులం, మతం, లింగ భేదం లేకుండా దేశ ప్రజలకు ప్రజాస్వామ్యం అందించగలమని తాము ఎప్పుడో నిరూపించామని చెబుతూ భారత్‌లో వివక్షకు తావేలేదని ప్రధాని పేర్కొన్నారు.

”అందుకే సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ నినాదంతో ముందుకు సాగుతున్నాం, ఇవే మా దేశం విశ్వసించే ఆధార సూత్రం. కులం, మతం, వయస్సు, బౌగోళిక తేడాలు లేకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది” అని తెలిపారు.  ఈజిప్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నేడు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈజిప్టులో 11వ శతాబ్దంలో నిర్మించిన చారిత్రక అల్ హకీమ్ మసీదును ప్రధాని సందర్శించనున్నారు. ఇక్కడ ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన 4,000 మందికి పైగా సైనికులకు నివాళులర్పిస్తారు.