ఉద్ద‌వ్‌, సంజ‌య్ స‌న్నిహితుల ఇండ్ల‌లో ఈడీ త‌నిఖీలు

బృహ‌ణ్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(బీఎంసీ)లో సుమారు 12 వేల కోట్ల‌ కరోనా కుంభకోణం జ‌రిగింది. దానికి సంబంధించిన మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్  ముంబైలో 15 ప్ర‌దేశాల్లో సోదాలు చేప‌ట్టింది. బీఎంసీ ఆఫీస‌ర్లు, సప్ల‌య‌ర్లను ఈడీ టార్గెట్ చేసింది.
 
కరోనా సంబంధిత మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డంలో నిమ‌గ్న‌మైన‌వారిపై ఈ దాడి జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ కేసుతో సంబంధం ఉన్న ఇక్బాల్ చాహ‌ల్‌ను విచారించారు. ఉద్ధ‌వ్ థాక‌రేతో స‌న్నిహితంగా ఉన్న ఐఏఎస్ అధికారుల‌తో పాటు సంజ‌య్ రౌత్ స్నేహితుడు సుజిత్ పాట్క‌ర్‌, సూర‌జ్ చాన‌వ్ ఇండ్ల‌పై త‌నిఖీలు జ‌రుగుతున్న‌ట్లు ఈడీ అధికారులు వెల్ల‌డించారు.
 
కరోనా ఫీల్డ్ ఆసుపత్రి స్కాంలో మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతో ఈ సోదాలు జరుగుతున్నాయి. సంజయ్ జైస్వాల్ గతంలో థానే కమిషనర్ గా విధుల నిర్వహించారు. కరోనా సమయంలో ముంబై డిప్యూటీ కమిషనర్ పదవిలో కూడా పని చేశారు. ఈ కేసుకు సంబంధించి జనవరిలో బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.
 
రూ.12 వేల కోట్ల స్కామ్‌ను విచారించేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు రెండు రోజుల క్రితం మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక‌నాథ్ షిండే తెలిపారు. మరోవైపు, సుజిత్ పై గతంలోనే మనీ లాండరింగ్ అభియోగాలు నమోదు చేసింది ఈడీ.  హెల్త్ కేర్ రంగంలో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కరోనా సమయంలో అతడికి ఫీల్డ్ ఆసుపత్రి కాంట్రాక్ట్ దక్కింది.
 
ఇందుకు సంబంధించి బీజేపీ నేత కీర్తి ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  దీని ఆధారంగా లైఫ్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, పాట్‌కర్‌, అతడి ముగ్గురు సన్నిహితులపై కేసులు నమోదు చేశారు. తప్పుడు విధానంలో వీరు ఫీల్డ్‌ ఆస్పత్రుల కాంట్రాక్టులు దక్కించుకొన్నారన్నవి అభియోగాలు. దీనిపై ఈడి దర్యాప్తు జ‌రుపుతున్న‌ది.
 
కాగా కరోనా సమయంలో హైదరాబాద్ హాస్పిటల్స్ నుండి ముంబై బీఎంసీకి మెడికల్ కిట్స్ సరఫరా అయ్యాయి. దీంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు మెడికల్ సంస్థలు కూడా ఇరుక్కున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.