ఒడిశా రైలు ప్రమాదంలో కుట్ర కోణం నిజమేనా?

292 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. రైలు ప్రమాదం జరిగిన సమయంలో బాలాసోర్ స్టేషన్ ఇంజినీర్ గా ఉన్న వ్యక్తి ఇంటిని సీబీఐ అధికారులు సీల్ చేశారు.

సిగ్నలింగ్ వ్యవస్థలో కావాలనే మార్పులు చేశారని, రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ  రైలు ప్రమాద ఘటన జరిగిన ప్రాంత సిగ్నలింగ్ వ్యవస్థ కు బాధ్యుడిగా ఉన్నసెక్షన్ రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ఉంటున్న బాలాసోర్ లోని ఇంటిని సీబీఐ సీల్ చేసింది.

అయితే, ప్రమాదం జరిగిన నాటి నుంచి, ఆ ఇంజినీర్ అతడి కుటుంబ సభ్యులు కనిపించడం లేదు. మరోవైపు, ‘‘రైలు ప్రమాదంపై దర్యాప్తులో భాగంగా ఉన్న ఏ రైల్వే ఉద్యోగి కూడా పరారీలో లేరు’’ అని రైల్వే శాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. అనంతరం, ఈ జూన్ 16న అతడు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతడు కానీ, అతడి కుటుంబ సభ్యులు కానీ ఆ ఇంటిలో లేరు. సీబీఐ అధికారులు ఆ ఇంటిని సీల్ చేశారు. అనంతరం సిబిఐ సిబ్బంది సిగ్నల్ జెఇ ఇంటిపై నిఘా వేసి ఉంచారు.

సిబిఐ అధికారులు గతంలో రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ను రహస్య ప్రదేశంలో ప్రశ్నించారు. ఈ రైలు ప్రమాద ఘటన తర్వాత సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్, అతని కుటుంబం అద్దె ఇంటి నుంచి నుంచి పారిపోయారని సమాచారం.మరోవైపు సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం బహనాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి కూడా వెళ్లారు.

రైళ్ల రాకపోకల విషయంలో, అవి సురక్షితంగా ప్రయాణించడానికి రైల్వేలో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ పాత్ర చాలా కీలకం. సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూట్స్, పాయింట్ మెషీన్స్, ఇంటర్ లాకింగ్ సిస్టమ్స్.. ఇవన్నీ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ పరిధిలోనే ఉంటాయి.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొని పట్టాలు తప్పడం, అదే సమయంలో ఎదురుగా వస్తున్న యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ బోగీలు ఈ కోరమాండల్ బోగీలను ఢీకొని, అవి కూడా పట్టాలు తప్పడంతో ప్రమాద తీవ్రత బాగా పెరిగింది.