మోదీని ఎదుర్కొనే దమ్ములేక విపక్ష పార్టీల కూటమి

ప్రధాని మోదీని ఎదుర్కొనే దమ్ములేక విపక్ష పార్టీలన్నీ కూటమి కడుతున్నాయని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ ఎద్దేవా చేశారు. జూన్ 23న పాట్నాలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంపై ఆయన విరుచుకుపడుతూ ప్రధానమంత్రి పదవి కోసం విపక్ష పార్టీలు, నేతల మధ్య పోరు జరుగుతోందని ఆరోపించారు.

ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్ష అగ్రనేతల సమావేశానికి పిలవడంపై రవిశంకర్​ విమర్శలు గుప్పించారు.  “విపక్షాల (ప్రతిపక్ష) ప్రధాని ఎవరు?” అని ప్రశ్నించారు. మహాకూటమిలోని పార్టీలను ‘అధికారం కోసం స్వార్థపరుల’ సభగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఒంటరిగా ఎదుర్కోలేని అసమర్థత గలవారని దుయ్యబట్టారు.

ఇది అధికారం కోసం స్వార్థపరులు కడుతున్న కూటమి అని, వారు ప్రధాని మోదీని ఒంటరిగా ఎదుర్కోలేరు కాబట్టి, వారంతా కలిసికట్టుగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశం స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటుందని, ఒకరితో ఒకరు పోరాడుకునే వ్యక్తుల సమూహం కాదని ప్రసాద్ స్పష్టం చేశారు.

కాగా, ఈ మధ్యనే బిహార్​ సీఎం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విపక్షాల ఐక్యత కారణంగా లోక్‌సభ ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించడానికి బీజేపీ ఆలోచిస్తున్నట్లు ఆరోపించారు.  విపక్షాలన్నీ ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి బీజేపీని గద్దె దింపడం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని తాను అన్ని పార్టీలను కోరానని. అందుకనే జూన్ 23 సమావేశం తర్వాత తాము దీనిపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు.