ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్‌గా భారత ఫుట్‌బాల్ జట్టు

ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. భువ‌నేశ్వ‌ర్‌లోని క‌లింగ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన టైటిల్ పోరులో లెబ‌నాన్‌పై 2-0తో గెలుపొందింది. దీంతో ఇంటర్ కాంటినెంటల్ కప్ లో విజేతగా నిలిచిన భారత పురుషుల ఫుట్ బాల్ జట్టుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు జట్టుకు రూ.కోటి నగదు బహుమానం ప్రకటించారు.
భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ తన 87వ అంతర్జాతీయ గోల్‌ను సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌ తరఫున లాలియన్‌జులా చాంగ్టే మరో గోల్‌ చేసి జట్టును మంచి స్థితిలో ఉంచాడు. 2018 ప్రారంభ ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో టైటిల్. 2019లో కొరియా ఛాంపియన్‌గా నిలిచింది.
 
‘ప్రతిష్టాత్మకమైన ఇంటర్ కాంటినెంటల్ కప్ కు ఆతిథ్యమివ్వడం మన రాష్ట్రం గవ్వించదగ్గ విషయం. గట్టి పోటీని ఎదుర్కొంటూ భారత పురుషుల జట్టు విజయం సాధించినందుకు అభినందనలు. ఒడిశాలో మరెన్నో ఫుట్ బాల్ ఈవెంట్ లు నిర్వహించి క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందించాలనేది మా ఉద్దేశం’ అని నవీన్ పట్నాయక్ తెలిపారు.

ఈ మ్యాచ్‌లో భారత్ విజయం అంత సులువు కాదు. తొలి అర్ధభాగంలో లెబనాన్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఈ సమయంలో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. దీంతో తొలి అర్ధభాగం 0-0తో ముగిసింది. కానీ రెండో పీరియడ్‌లో భారత జట్టు దూకుడు ప్రదర్శించి సత్తా చాటింది. స్టార్ ఆట‌గాడు సునీల్ ఛైత్రీ 46వ నిమిషంలో జ‌ట్టుకు తొలి గోల్ అందించాడు.  కీలక సమయంలో భారత కెప్టెన్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసి భారత జట్టుకు విజయాన్ని అందించాడు.

మెుదట భారత్ 1-0తో ముందు ఉంది. ఈ గోల్ తర్వాత భారత్ ఆట మరింత దూకుడుగా మారింది. తద్వారా మ్యాచ్‌లో పూర్తి పట్టు సాధించింది. 66వ నిమిషంలో ల‌ల్లియంజుల ఛాంగ్టే రెండో గోల్ సాధించాడు. దాంతో, భార‌త ఆట‌గాళ్లు గెలుపు సంబురాలు చేసుకున్నారు. లాలియన్జులా చాంగ్టే మరోసారి బంతిని గోల్ పోస్ట్ లోపలికి నెట్టడంలో సఫలమయ్యాడు. దీని ద్వారా మ్యాచ్ ను భారత్‌ తన అధీనంలోకి తెచ్చుకోవడంలో విజయం సాధించింది.