కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది కాల్చివేత

ఖలీస్థాన్ మద్దతుదారుడు, ఎన్ఐఏ జాబితాలోని ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్‌‌ (46) కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సుల్లో పంజాబీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సర్రే సిటీ గురు నానక్ సిక్ గురుద్వారా వద్ద హరదీప్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.  పంజాబ్‌లోని ఫిల్లౌర్‌లో హిందూ పూజారి హత్యకు కుట్రతో సహా సిక్కు వేర్పాటువాదానికి సంబంధించిన కనీసం నాలుగు ఎన్ఐఏ కేసుల్లో నిజ్జర్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.
గతేడాది జులైలో అతడిపై రూ.10 లక్షల నగదు రివార్డును కూడా ఎన్ఐఏ ప్రకటించింది.  ఖలీస్థాన్ వేర్పాటువాద సంస్థ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చీఫ్ అయిన నిజ్జర్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నడుపుతున్న ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ ఎఫ్ జె) ఉగ్రవాద ఎజెండాను ప్రోత్సహించే బాధ్యతలు తీసుకున్నాడు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఎస్ఎఫ్‌జేను స్థాపించిన పన్నూన్ కెనడాలోని తన ప్రతినిధిగా నిజ్జర్‌ను నియమించాడు.
 
జీవనోపాధి కోసం ప్లంబర్‌గా పనిచేస్తూ సంపాదిస్తున్నట్టు చెప్పుకునే నిజ్జర్ భారత్‌కు వ్యతిరేకంగా కెనడాలోని ఖలీస్థాన్ మద్దతుదారులు నిర్వహించే ఆందోళనలు, నిరసనల్లో కీలకంగా వ్యవహరించాడు.   సర్రేలోని గురు నానక్ సిక్ గురుద్వారాను బలవంతంగా ఆక్రమించుకుని, దాని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు.
 
గత కొన్నేళ్లుగా వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద జరిగే ఆందోళనల్లో తరుచూ నిజ్జార్ పాల్గొంటున్నాడు. కెనడాలో సిక్కు సంతతికి చెందిన విద్యావేత్త మోనిదర్ బొయలే వంటి వేర్పాటువాదులతో నిజ్జర్‌కు స్నేహం ఉంది. బొయలే ప్రస్తుతం సర్రేలోని శ్రీ దామేశ్ దర్బార్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు.  గురు నానక్ సిక్కు గురుద్వారా, శ్రీ దామేశ్ దర్బార్‌లు రెండూ భారత్‌కు వ్యతిరేకంగా ఖలీస్థాన్ ఉద్యమాన్ని ఎగదోస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు కార్యకలాపాల నిర్వహణ, నెట్ వర్క్ ఏర్పాటు చేయడం, శిక్షణ, ఆర్థిక సహకారం వంటివి హర్దీప్ చేస్తుంటాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇతడి హస్తం ఉంది. పలు భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న హర్దీప్ ను  కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 40 మంది ఉగ్రవాదుల జాబితాలోనూ నిజ్జర్ పేరు  ఉంది