తమిళ మంత్రి సెంథిల్ బాలాజీకి 8 రోజుల ఈడీ కస్టడీ

మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మంత్రి సెంథిల్ కుమార్‌ను 8 రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగిస్తూ చెన్నై మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు శుక్రవారంనాడు ఆదేశాలిచ్చింది. ఈనెల 23న తిరిగి తమ ముందు హాజరుపరచాలని ఈడీకి స్పష్టం చేసింది.

హైకోర్టు ఆదేశాల మేరకు సెంథిల్ బాలాజీని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కావేరే ఆసుపత్రిలో చేర్చిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎస్.అలీ ముందు హాజరు పరిచారు. బాలాజీ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన అనంతరం ఆయన కస్టడీపై ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఆదేశాలిచ్చారు.

తమ విచారణకు మంత్రి సహకరించడం లేదని, నిజం బయటకు రావాలంటే తదుపరి విచారణ అవసరమని పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. బాలాజీ సమన్లు తీసుకోవడానికి, సంతకం చేసేందుకు నిరాకరించారని, బెదిరింపు ధోరణిలో వ్యవహరించారని, అరెస్టు సమయంలో ఆఫీసర్లపై కేకలు వేశారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

తమ ప్రశ్నలకు స్పందించడం లేదని, సమన్ల సమయంలోనూ సహాయనిరాకరణ చేశారని తెలిపారు. ఇంతవరకూ తాము జరిపిన విచారణ, స్టేట్‌మెంట్ల రూపంలో సేకరించిన వివరాల ప్రకారం పీఎంఎల్‌ఏ చట్టం కింద విచారణలో ఆయన పాత్ర చాలా కీలకమని ఈడీ కోర్టుకు విన్నవించింది. వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తులను, బాలాజీని ఒకచోట చేర్చి విచారణ జరిపాల్సిన అవసరం ఉందని తెలిపింది.

కాగా, బాలాజీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇలాంగో తన వాదన వినిపిస్తూ, వైద్య చికిత్స కోసం బాలాజీని ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టుకు విన్నవించారు. ఆయన తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్నట్టు ఒమాందురార్ ఆసుప్తరి ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలిచ్చినట్టు చెప్పారు.

ఈడీ సిద్ధం చేసిన పంచనామాను బట్టి విచారణకు మంత్రి సహకరించినట్టు తెలుస్తోందని, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్టుగా చెబుతున్న రూ 1.34 కోట్లు స్వాధీనం చేసుకున్నందున తన క్లెయింట్‌ను కస్టడీలోకి తీసుకోవలసిన అవసరం లేదని వాదించారు.