జమ్మూ కశ్మీర్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కశ్మీర్ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలో గల జుమాగుండ్  ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో.. పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.
 
గురువారం తెల్లవారుజామున జుమాగండ్‌ వద్ద విదేశీ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా సైన్యంపై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. ప్రతిగా జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదురుగు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.
 
స్థానిక పోలీసులతోపాటు సైన్యం ఆ ప్రాంతాన్ని జల్లడపడుతున్నదని ట్వీట్‌ చేశారు. మరణించిన ముష్కరులంతా విదేశీయులని వెల్లడించారు. ఈ నెల 13న కూడా కుప్వారాలో ఎల్‌ఓసీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. జిల్లాలోని డోబనార్‌ మచ్చల్‌  ప్రాంతంలో పోలీసులు, భద్రతా దళాలు ఉమ్మడిగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌందర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.