అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది. అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధికారికంగా ప్రకటించారు. బిపర్ జోయ్ తుఫాన్ దృష్ట్యా అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు తెలిపారు. ఖమ్మంలో అమిత్ షా పర్యటన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని బండి సంజయ్ తెలిపారు.
 
అమిత్ షా బుధవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకొని, గురువారం సాయంత్రం ఖమ్మంలో బిజెపి జరిపే బహిరంగసభలో ప్రసంగించాల్సి ఉంది.
తెలంగాణలో అధికారం దిశగా పార్టీని నడిపేలా బీజేపీ కార్యకర్తలు, శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన సాగేలా ఏర్పాట్లు చేశారు.
 
గురువారం రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై పలు అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని భావించారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మిగిలింది ఐదారు నెలల స్వల్ప సమయమేనని, ఈ సమయంలోగా పార్టీ పుంజుకుని మళ్లీ మునుపటిలాగా బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనన్న అభిప్రాయం ప్రజల్లో తేవాలంటే ఎలా దూకుడుగా వ్యవహరించాలి? వంటి అంశాలపై పార్టీ నేతలకు ఆయన సూచిస్తారని భావించారు.
 
తెలంగాణ పర్యటనలో భాగంగా నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కావటం కూడా షెడ్యూల్ లో భాగంగా ఉంది. దీంట్లో భాగంగానే ప్రముఖ సినీ దర్భకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ లతో పాటుతో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ సమావేశం కావాల్సి ఉంది. కానీ పర్యటన రద్దుతో ఈ సమావేశాలు కూడా రద్దయినట్లు తెలుస్తోంది.