రైల్వే ప్రమాదంలో ఐదుగురు సిబ్బందిపై విచారణ

ఒడిశా బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం యావత్‌ భారతదేశాన్ని షాక్‌కు గురి చేసింది. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది. ఈ ఘటనపై ఓ వైపు రైల్వేశాఖ బృందంతో పాటు సీబీఐ సైతం విచారణ జరుపుతున్నది.  అయితే, రైలు ప్రమాదానికి సంబంధించిన కేసులో బహనగ బజార్‌ స్టేషన్‌ మాస్టర్‌తో సహా ఐదుగురు రైల్వో ఉద్యోగులను విచారిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ప్రస్తుతం సిగ్నలింగ్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఈ నెల మొదటల్లో ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్నాడు. ఐదుగురు ఉద్యోగులు ప్రస్తుతం తమ విధులను నిర్వర్తిస్తున్నారని, రైల్వే సేఫ్టీ కమిషన్‌  రూపొందించిన ప్రమాద దర్యాప్తు నివేదికపై భవిష్యత్‌ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అయితే, సిస్టమ్‌ మాన్యువల్‌ ట్యాంపరింగ్‌, ఆటోమేటెడ్‌ సిగ్నలింగ్‌ సిస్టమ్‌ ఇంటరాలింగ్‌ సిస్టమ్‌లో లోపమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు సిబ్బంది కేంద్రంగా విచారణ జరుగుతుందని సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. త్వరలోనే సీఆర్‌ఎస్‌ నివేదిక రానున్నది. ఉద్దేశపూర్వకం చేశారా? అనుకోండా జరిగిందా? ఏమైనా సాంకేతిక లోపంతో జరిగిందా? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తున్నది.

అయితే, రైలు ప్రమాదం ఘటన విషయంలో వస్తున్న రాజకీయ విమర్శలపై రైల్వే ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ రైలు దుర్ఘటనను రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో జరుగుతున్న రైల్వే పనితీరుపై వస్తున్న విమర్శలను చూస్తుంటే బాధ ఉందని, ఈ దాడి చిత్తశుద్ధిని, కర్తవ్య భక్తిని అవమానించడమేనని సంఘాలు పేర్కొన్నాయి.

కాగా, ప్రమాదం తరువాత ఇదంతా అంతా కూడా కేవలం సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తిన లోపాల వల్లనే జరిగిందని జాతీయ, అంతర్జాతీయ మీడియాలలో వార్తలు వెలువడ్డాయి. రైళ్లు సాగేందుకు ముందుగా గ్రీన్ లైట్ తరువాత వెంటనే రెడ్ సిగ్నల్ రావడం ఈ క్రమంలో అప్పటికే దూసుకువెళ్లిన రైలు పక్కట్రాక్‌లోకి దూకుడుగా వెళ్లిన ఫలితం చేదు అనుభవానికి దారితీసిందని ముందు అంతా భావించారు.

అయితే దీనిని మించిన కారణాలు ఉన్నాయని ఇప్పుడు వాదనలు వెలువడుతున్నాయి. తరచూ ఈ ప్రాంతంలో సిగ్నలింగ్ వ్యవస్థలో భారీ స్థాయిలో లోపాలు ఏర్పడుతూ వస్తున్నాయని తొలుత రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

సిగ్నలింగ్ వ్యవస్థ ఆటోమొటిక్ పద్ధతిలోనే ఉంది కానీ దీనిని ఈ క్షణాలలో ఎవరో దీని సిగ్నల్‌ను మార్చి ఉంటారనేది కూడా ఈ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే పలు స్థాయిల్లో దర్యాప్తు జరుగుతున్నందున ఇటువంటి వాటిపై తాము స్పందించలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు రైల్వేల అధికారిక భద్రతా వ్యవస్థ అయిన సిఆర్‌ఎస్ నిరాకరించింది.

ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో రైళ్లల్లో ప్రయాణికుల భద్రతపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే భద్రతా కమిషన్  విడుదల చేసిన ఓ నివేదిక ఆందోళనలను మరింత పెంచుతోంది. 2017- 2022 మధ్యలో మానవ తప్పిదాలతో ఏకంగా 190కిపైగా రైలు ప్రమాదాలు జరిగినట్టు ఆ నివేదిక పేర్కొంది.
2017- 2022 మధ్య కాలంలో 256 రైలు ప్రమాదాలు జరగగా, వీటిల్లో 75శాతం వరకు ప్రమాదాల్లో రైళ్లు పట్టాలు తప్పాయి. 192 రైళ్లు ప్రమాదానికి గురవ్వడానికి మానవ తప్పిదమే (రైల్వే సిబ్బంది, సాధారణ పౌరులు) కారణం! తాజాగా జరిగిన ఒడిశా రైలు ప్రమాదం కూడా మానవ తప్పిదమేనని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.