శ్రీకాళహస్తిలో రూ.500లతో అంతరాలయ దర్శనం

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునేందుకు దర్మకర్తల మండలి ఇకపై ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతరాలయ దర్శనం చేసుకోవడానికి రూ. 500 టికెట్ ను ప్రవేశ పెట్టాలని తీర్మానించింది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సువర్ణముఖి నదిని పవిత్రంగా ఉంచడానికి పట్టణ పరిధిలో నదిలోని మురుగు నీటిని పైప్ లైన్ ద్వారా తరలించే పథకానికి ఆమోదం తెలిపామని శ్రీనివాసులు చెప్పారు. ప్రోటోకాల్ విఐపి లకు నిర్దిష్ట సమయంలో దర్శనం ఏర్పాటు చేసే అంశాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు తెలిపారు. స్థానిక భక్తులకు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అంతరాలయ దర్శనం త్వరలో అమలులోకి తీసుకొస్తామని చెప్పారు.

ప్రధాన ఆలయంలో లీకేజీ నివారణకు సంబంధించి రూ. 3 కోట్లతో పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దాత సహకారంతో ఈ పనులు చేయనున్నట్లు తెలిపారు. రామసేతు వంతెన కొత్త బ్రిడ్జి మధ్య ఖాళీ స్థలంలో దక్షిణామూర్తి విగ్రహాన్ని, సీడ్స్ సర్కిల్లో ధ్యానమూర్తి శివయ్య విగ్రహం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక వాతావరణం పట్టణంలో కనిపించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఆదికాలంలో ఉన్న గురు దక్షిణామూర్తి బ్రహ్మోత్సవాల పునర్ధరణ చేయడంపై చర్చించినట్లు తెలిపారు.  ఇష్టానుసారం చేసే అంతర్గత బదిలీలతో పలు ఇబ్బందులు ఏర్పడుతున్నందున ఆలయంలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు ధర్మకర్తల మండలి అనుమతితో మాత్రమే చేయాలని తీర్మానించారు. ప్రముఖుల ఆశీర్వాదానికి ఇకపై ప్రత్యేకంగా ఆశీర్వాద మండపం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 గిరిప్రదక్షిణ మార్గంలో సోలార్ లైట్లు ఏర్పాటు, ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం తదితర అంశాలను ఆమోదం తెలిపినట్లు చెప్పారు. నిత్య అన్నదాన మండపం పైన మరో సెల్లార్ ఏర్పాటు చేసి ఒకే విడతలో 1000 మందికి అన్నదానం చేసేలా చేస్తామని పేర్కొన్నారు. అమ్మవారి నెప్పాల మండపం పునర్నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.