ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్!

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ షోలో కమెడియన్ గా కనిపించే హరి ఇరుక్కున్నాడు. చిత్తూరు జిల్లా పుంగనూరులో సుమారు రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగల తరలింపులో జబర్దస్త్ హరికి సంబంధం ఉందని పోలీసులు అంటున్నారు.
హరి ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జబర్దస్ హరి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా హరి పేరు స్మగ్లింగ్ కేసుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  పుంగనూరు మండలంలోని మొరంపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.
నిందితుల ప్రయాణించిన రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ దాడిలో కిషోర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిని విచారించిన పోలీసులు ఈ వ్యవహారం వెనుక జబర్దస్ కమెడియన్ హరి ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే కమెడియన్ హరిపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి.

రెండేళ్ల క్రితం చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని చీకిమానుకోన అటవీప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ సమాచారంతో పోలీసులు దాడులు చేసి ఎనిమిది మంది దుండగులను అరెస్టు చేశారు. అప్పుడు పోలీసుల నుంచి జబర్దస్త్‌ హరి తప్పించుకున్నాడు.

చీకిమానుకోనలో పట్టుబడ్డ స్మగ్లర్ల నుంచి రెండు నాటు తుపాకులతో పాటు మూడు లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఒకసారి ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో హరి పట్టుబడ్డాడు. అయినా అతడు స్మగ్లింగ్‌ కార్యకలాపాలు మానలేదని సమాచారం. దీంతో హరికి పలువురు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ తో హరి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినా అతడు స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జైలుకు వెళ్లిన ప్రతీసారి బెయిల్ పై బ‌య‌ట‌కు రావ‌డం తిరిగి స్మగ్లింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడ‌ని పోలీసులు గుర్తించారు. అలాగే హరికి త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌కు చెందిన‌ స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. హరి పలువురి సాయంతో ఎర్రచంద‌నం చెట్లను నరికి ఇత‌ర రాష్ట్రాల‌కు అక్రమంగా ర‌వాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.