జగన్ విశాఖను విద్రోహ శక్తుల అడ్డాగా మార్చారు

ఏపీలో విశాఖను విద్రోహులకు సెంటర్గా మార్చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్షా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శలు గుప్పించారు.  ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా విశాఖలోని రైల్వేగ్రౌండ్‌లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో ఆదివారం సాయంత్రం ప్రసంగిస్తూ అవినీతి తప్ప, జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదని విరుచుకుపడ్డారు.
రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని అమిత్ షా ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్య విషయంలో జగన్ సిగ్గుపడాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇస్తున్న నిధులను రైతు భరోసా పేరుతో తానే ఇస్తున్నట్టు జగన్ మభ్యపెడుతున్నాడని కేంద్ర మంత్రి ఆరోపించారు. మోదీ ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్ ఫోటోలు వేసుకుంటున్నారని మండిపడ్డారు.
 
పదేళ్లలో ఏపీ అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల మేర రాష్ట్రంలో అభివ‌ద్ధి కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. ఆ డబ్బంతా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
 
విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలకు నిధులు ఇచ్చామని,ఏపీకి కేంద్ర ప్రభుత్వ అనేక విద్యాసంస్థలు ఇచ్చిందని అమిత్ షా చెప్పారు. ఐఐటీ తిరుపతి, ఐఐఎం విశాఖ సహా మూడు వైద్యకళాశాలలు ఇచ్చామని చెబుతూ ఏపీలో 25 ఎంపీ స్థానాల్లో 20 బీజేపీకి రావాలని అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు.
 
కాగా, పదేళ్ల యూపీఏ పాలనలో అన్నీ కుంభకోణాలే అని అమిత్ షా ఆరోపించారు. యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని స్పష్టం చేశారు. 70 కోట్ల మంది పేదలకు అనేక పథకాలు అమలు చేశామని, రైతులకు ఏటా రూ.6 వేలు సాయం అందిస్తున్నామని తెలిపారు. 
 
పుల్వామా దాడి ఘటన తర్వాత 10 రోజుల్లోనే పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పామని గుర్తు చేశారు. మోదీ ప్రధాని అయ్యాక మన దేశం పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోందని,  ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నినాదమే వినిపిస్తోందని కొనియాడారు. మోదీ వచ్చాక దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం అయిందని చెప్పారు.  అందుకే 2024 ఎన్నికల్లో కూడా మోదీనే గెలిపించాలని కోరుతూ 300 పైకి ఎంపీ స్థానాల్లో మళ్లీ విజయం సాధిస్తామనే భరోసాను వ్యక్తం చేశారు.
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేసిన ఘనత తమ ప్రభుత్వానికి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. దీనితో ప్రపంచ దేశాలు మోదీ జపం చేస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ ఏ ఒక్క పార్టీకో లేక బీజేపీకో చెందిన వ్యక్తి కాదని, ఆయన విశ్వ గురువు అని అమిత్ షా ప్రశంసించారు. ప్రపంచ దేశాలు మోదీని విశ్వగురువుగా భావించడం కోట్లాదిమందికి భారతీయులకు దక్కుతున్న గౌరవమని తెలిపారు.