తెలంగాణపై ఎలాంటి వివక్ష లేదు

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని.. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని  కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు.  కరీంనగర్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో పాల్గొంటూ కాళేశ్వరం, రామగుండం ఎరువుల కర్మాగారం, నేషనల్‌ థర్మల్‌ ప్రాజెక్టుకు కేంద్రమే అన్ని అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు.

 పేదల కోసం నిరంతరం పాటుపడుతున్న ప్రభుత్వం మోదీ అయితే, నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో రాష్ట్రం ఏర్పడితే వాటికే తిలోదకాలిచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇస్తే… అవినీతికి ఏటీఎంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు.

మోదీ కేబినెట్ లో ఒక్క మంత్రిపై కూడా అవినీతి మచ్చలేదని, అయితే కేసీఆర్ కేబినెట్ లో అవినీతి ఆరోపణలు లేని వారే లేరని జవదేకర్ విమర్శించారు. మోదీకి కుటుంబం ఉన్నా…. ప్రజల కోసమే పనిచేశారని, ఆయనది దేశభక్తి కలిగిన ప్రభుత్వమని చెబుతూ అయితే కేసీఆర్ విషయానికొస్తే.. ఆయనది పూర్తిగా కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వమని పేర్కొన్నారు.

ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల ద్వారా రూ. 60 వేల కోట్లు ఇస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించడం సిగ్గు చేటని మాజీ కేంద్ర మంత్రి మండిపడ్డారు. తాడిత పీడిత ప్రజలకు సేవ చేస్తున్న పార్టీ బీజేపీ అంటూ కోట్లాది మందికి ముద్ర రుణాలు మంజూరు చేసిందని, 40 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద 6 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేసిందని గుర్తు చేశారు.

రైతులపై పడకుండా ఎరువుల సబ్సిడీని 5 రెట్లు పెంచారని జావడేకర్ గుర్తు చేశారు. 2013-14లో వ్యవసాయ బడ్జెట్ కేవలం రూ.21,000 కోట్లు మాత్రమేనని,  ఇప్పుడు రూ.1,25,000 కోట్లకు పెరిగిందని తెలిపారు. వ్యవసాయ క్రెడిట్ ఇప్పుడు రూ.20 లక్షల కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు.  దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 323 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, వరి మూడు రెట్లు, గోధుమ రెండింతలు ఎక్కువగా సేకరిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కొరకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు.

 
పంటల బీమా పథకం కింద రైతులకు రూ.1,33,000 కోట్ల పరిహారం చెల్లించామని,11 కోట్ల మంది రైతులు కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2,60,000 కోట్లు లబ్ధి పొందారని చెప్పారు. వారిలో 39 లక్షల మంది తెలంగాణ రైతులు ఉన్నారని అంటూ,  1.12 లక్షల మంది కరీంనగర్‌కు చెందిన రైతులే ఉన్నారని తెలిపారు.  దేశంలో 80 కోట్ల మందికి గత మూడు సంవత్సరాలుగా ఉచిత బియ్యం అందించామని చెప్పారు.
40 కోట్ల ముద్ర రుణాలు, 37 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు, 30 కోట్ల సురక్ష బీమా యోజన, 13 కోట్ల జీవన్ జ్యోతి బీమా యోజన, 10 కోట్ల జల్ జీవన్ కనెక్షన్లు, 11 కోట్ల మరుగుదొడ్లు, 10 కోట్ల ఉచిత LPG కనెక్షన్లు, 3.5 కోట్ల పీఎం ఆవాస్ యోజన, 3.5 కోట్ల విద్యుత్ కనెక్షన్లు వంటి పథకాలన్నీ పేదలకు.. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు సాధికారత కల్పించాయని ఆయన వివరించారు. లక్షలాది మంది మైనారిటీ విద్యార్థులు ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్, గ్రాడ్యుయేషన్, పీహెచ్ స్కాలర్‌షిప్‌లు పొందుతున్నారని చెప్పారు.