సెయిల్‌లో పెరిగిన ఎల్‌ఐసి వాటాలు

దేశంలో అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో ఎల్‌ఐసి వాటాలు మరింత పెరిగాయి. దిగ్గజ బీమా సంస్థ తన వాటాను మరో 2.001 శాతం పెంచుకోవడం ద్వారా 6.686 నుంచి 8.687కు చేర్చుకున్నట్లు వెల్లడించింది.  దీంతో సెయిల్‌లో ఎల్‌ఐసి 35.88 కోట్ల షేర్లను కలిగి ఉండటంతో ప్రధాన ఇన్వెస్టర్‌గా ఉంది.
ఈ విషయాన్ని రెగ్యూలేటరీ సంస్థలకు ఎల్‌ఐసి తెలిపింది. ఇంతక్రితం సెయిల్‌లో 27,61,48,137 ఈక్విటీ షేర్లు ఉండగా, తాజాగా ఇది 35,88,07,919 ఈక్విటీ షేర్లను ఎల్‌ఐసి కలిగి ఉన్నట్లు వెల్లడించింది.  ఈ వారం ప్రారంభంలో టెక్‌ మహీంద్రాలోనూ తమ వాటాను 8.88 శాతానికి పెంచుకున్నట్లు ఎల్‌ఐసి స్టాక్‌ ఎక్సేంజీలకు తెలిపింది.
2022 నవంబర్‌ 11 నుంచి 2023 జూన్‌ 6 మధ్య కాలంలో బహిరంగ మార్కెట్‌లో అదనంగా 2.015 శాతం వాటాలను కొనుగోలు చేసింది.  దీంతో టెక్‌ మహీంద్రాలో వాటా 6.869 శాతం నుండి 8.884 శాతానికి పెరిగిందని వెల్లడించింది. టెక్‌ మహీంద్రాషేర్లను సగటు ధర రూ.1,050.77తో కొనుగోలు చేసినట్లు తెలిపింది. మార్చి 31 నాటికి టాటా పవర్‌లో 7.52 శాతం వాటా ఉండగా ప్రస్తుతం 7.93 శాతానికి చేరింది.
 
బాటా ఇండియాలోనూ 2023 మార్చి 31 నాటికి 5.01 శాతం వాటాలు ఉండగా.. రపస్తుతం 6.53 శాతానికి చేరింది. టాటా పవర్‌లో రూ.234.02తో, బాటా ఇండియాలో సగటు ధర రూ.1,433.54తో కొనుగోలు చేసినట్లు ఎల్‌ఐసి తెలిపింది. శుక్రవారం బిఎస్‌ఇలో ఎల్‌ఐసి షేర్‌ విలువ 0.32 శాతం తగ్గి రూ.601.75 వద్ద ముగిసింది. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసి భారత స్టాక్‌ మార్కెట్లలో ప్రధాన ఇన్వెస్టర్‌గా ఉంది.