కెనడాలో `ఇందిరా హత్య’ వేడుకలపై భారత్ ఆగ్రహం

మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ హత్యను కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులు సెలబ్రేట్ చేసుకున్నారనే వార్తలపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  భారత్ తో మంచి సంబంధాలు కోరుకునే కెనడాకు ఇది సరికాదని స్పష్టం చేశారు. కెనడాలో వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను సమర్థించే వ్యక్తులకు అవకాశం ఇవ్వడం సరికాదని, ఇది భారత్‌తోను సత్సంబంధాలకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఇందిర హత్యను కెనడాలో సెలబ్రేట్ చేసుకునే వారిపై ఆయన తీవ్రంగా స్పందించారు.

ఇందులో పెద్ద సమస్య ఉందని తాను భావిస్తున్నానని, ఓటు బ్యాంకు రాజకీయాల అవసరాలు కాకుండా ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారో మనం అర్థం చేసుకోలేకపోతున్నామని జైశంకర్ పేర్కొన్నారు. వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు, హింసను సమర్థించే వ్యక్తులకు చోటు కల్పించడం సమంజసం కాదని, ఇది కెనడాకు కూడా మంచిది కాదని ఆయన హితవు చెప్పారు.

1984 సంవత్సరంలో ఇందిరా గాంధీని.. ఆమె భద్రతా సిబ్బంది అతి దారుణంగా హత్య చేశారు.  ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 39 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కెనడాలోని ఖలిస్థాన్ సానుభూతి పరులు నిర్వహించిన పరేడ్ లో భాగంగా శకటాల ప్రదర్శన చేపట్టారు. అందులో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య ఘటనను రీక్రియేట్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
 
దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు ఏ విధంగా చంపారో.. బొమ్మలతో సహా కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. దర్బార్ సాహిబ్ హత్యకు ప్రతీకారంగా ఇందిరాగాంధీని హత్య చేసినట్లు తెలిపే సందేశాన్ని కూడా ఆ పరేడ్‌లో ప్రదర్శించారు.
ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ పరేడ్‌ను నిర్వహించినట్లు తెలుస్తోంది.
 
పరేడ్ నిర్వహించిన విషయం తెలుసుకుని తాను దిగ్భ్రాంతి చెందినట్లు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మిలింద్ దేవర ట్విట్టర్ లో తెలిపారు. ఇది హేయమైన చర్యగా పేర్కొంటూ ఇందిరా గాంధీ మరణం వల్ల భారత దేశానికి కలిగిన బాధను గౌరవించాలని, ఈ చర్యను దేశ ప్రజలు అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి కెనడాతో మాట్లాడాలని కేంద్రాన్ని కోరింది. బ్రాంప్టన్ నగరంలో ఇందిర హత్యను సెలబ్రేట్ చేసిన వీడియోను కాంగ్రెస్ నేత మిలింద్ దియోరా షేర్ చేశారు.
 

ఈ విషయం తెలిసి తాను భయంతో ఆందోళన చెందినట్లు భారత్‌లో కెనడా హై కమిషనర్ కామెరూన్ మెక్‌ కే వెల్లడించారు. ద్వేషాన్ని, హింసను కీర్తించడానికి కెనడాలో చోటు లేదని స్పష్టం చేస్తూ మెక్ కే ట్వీట్ చేశారు. ఇలాంటి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.