అవినాష్ 8వ నిందితుడు.. అరెస్ట్, విడుదల

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డ్డి హత్య కేసులో వైసీపీ కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి నిందితుడేనని సీబీఐ స్పష్టం చేసింది. కోర్టుకు అందజేసిన నివేదికలో అవినాశ్‌ 8వ నిందితుడదని నివేదించింది. అంతేకాకుండా, గత శనివారం విచారణకు హాజరైనప్పుడు అరెస్ట్ చేసి, వెంటనే రూ 5 లక్షల పూచికత్తుపై విడుదల చేసిన్నట్లు వెల్లడైంది.
అవినాశ్‌కు ముందస్తు బెయిల్‌ ఇస్తూ తెలంగాణ హైకోర్టు మే 31న ఇచ్చిన తీర్పులోని అంశాల ఆధారంగా సీబీఐ అరెస్టు, విడుదల ప్రక్రియను ముగించింది. ‘‘ఒకవేళ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయాల్సి వస్తే.. రూ.5 లక్షల వ్యక్తిగత బాండ్‌, సీబీఐ సంతృప్తి మేరకు తగిన మొత్తానికి రెండు పూచీకత్తులు తీసుకుని విడుదల చేయాలి’’ అని హైకోర్టు తన తీర్పులో ఆదేశించింది. అలాగే జూన్‌ నెల మొత్తం ప్రతి శనివారం సీబీఐ ఎదుట ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు హాజరుకావాలని పేర్కొంది. ఆ విధంగా ఈ నెల 3న హాజరైనప్పుడు అరెస్ట్, విడుదల జరిగినట్లు ఇప్పుడు తెలుస్తున్నది.
 
ప్రస్తుతం అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై దాఖలు చేసిన కౌంటర్‌ లో సీబీఐ పలు కీలక విషయాలను పేర్కొంది. హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌ ల పాత్ర ఉందని చెప్పింది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసం వెనక భారీ కుట్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.
 
దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు వీరిద్దరూ ఎన్నో ప్రయత్నాలు చేశారని తెలిపింది. శివశంకర్‌ రెడ్డి ఫోన్‌ చేసిన నిమిషంలోపే అవినాశ్‌ రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారని చెప్పింది. ఉదయం 5.20కి ముందే అవినాశ్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డిలతో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది.
 
కేసు పెట్టద్దని, పోస్ట్‌ మార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాశ్‌, శివశంకర్‌ రెడ్డి చెప్పారని వెల్లడించింది. దర్యాప్తును పక్కదారి పట్టించేలా తండ్రీకుమారులు భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును, కీలక సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.
 
కడప, పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్‌రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని పేర్కొంటూ  అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే భాస్కర్‌రెడ్డి బలానికి నిదర్శనమని తెలిపారు. భాస్కర్‌రెడ్డి బయట ఉంటే చాలు.. పులివెందుల సాక్షుల ప్రభావితమైనట్లేనని అధికారులు తేల్చి చెప్పారు.