మాగుంట రాఘవ బెయిల్ `సుప్రీం’లో రద్దు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడు మాగుంట రాఘవరెడ్డికి ఢిల్లీ హైకోర్టులో మంజూరైన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అమ్మమ్మ కు అనారోగ్యం కారణంగా మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ ను రెండు రోజులక్రితం మంజూరు చేసింది.
 రాఘవకు బెయిల్ ఇస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అమ్మమ్మ బాత్రూంలో జారిపడినందుకు బెయిల్ మంజూరీ చేయడం సబబు కాదని ఈడీ తరపు న్యాయవాది ఏఎస్ జి ఎస్ వి రాజు వాదించారు.
ఐసీయూలో ఉన్నప్పుడు ఎవరినీ చూడడానికి అనుమతించరని, మాగుంట రాఘవ మాత్రమే అమ్మమ్మను చూసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రెండు వారాలు మాత్రమే హైకోర్టు రాఘవకు బెయిల్ మంజూరీ చేసిందని రాఘవ తరపు లాయర్ దేశాయ్ వాదించారు.  తన భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ మధ్యంతర బెయిల్ కోరారని, దాన్ని ట్రయల్ కోర్టు కొట్టివేసిందనే విషయాన్ని కూడా ఈడీ తరపు లాయర్ ధర్మాసనం ముందు ఉంచారు. రాఘవ బెయిల్ పై విడుదలై రెండు రోజులైందని, ఇప్పటికే అమెను రాఘవ చూసి రావొచ్చని అభిప్రాయపడ్డారు.

ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం రాఘవకు మంజూరు అయిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేసింది. జూన్ 12వ తేదీన స్థానిక కోర్టులో సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఫిబ్రవరి 10న ఆయనను అరెస్ట్ చేశారు.