మంత్రి అనురాగ్ హామీతో రెజ్లర్ల ఆందోళనకు విరామం

లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌కు వ్య‌తిరేకంగా చేపట్టిన నిరసనలను ఈ నెల 15 వరకు విరమించుకోవడానికి రెజ్ల‌ర్లు అంగీకరించారు.  కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో జరిగిన చర్చల అనంతరం రెజ్లర్లు తమ ఆందోళనను తాత్కాలిక విరమిస్తున్నట్టు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం రాత పూర్వక హామీ ఇవ్వడంతో రెజ్లర్లు ఆందోళనను విరమించారు. మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానంపై ఆయన నివాసంలో బుధవారం ఆరు గంటలసేపు జరిగిన చర్చలలో బ్రీజ్ భూషణ్ పై విచారణ ఈ నెల 15 నాటికి పూర్తవుతుందని హామీ ఇవ్వడంతో పాటు, అప్పటి వరకు నిరసనలు చేపట్టరాదని కోరడంతో వారు అంగీకరించారు.  

మ‌హిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్‌లో అంతర్గ‌త ఫిర్యాదు క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. రెజ్ల‌ర్ల‌పై న‌మోదైన అన్ని ఎఫ్ఐఆర్‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని, బ్రిజ్ భూష‌ణ్ సింగ్ మూడుసార్లు డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ ప‌ద‌వి చేప‌ట్టినందున మ‌రోసారి ఆయ‌న‌ను ఎన్నుకోరాద‌ని రెజ్ల‌ర్లు ప‌ట్టుబ‌ట్టారు.

డ‌బ్ల్యూఎఫ్ఐ ఎన్నిక‌ల‌ను ఈనెల 30లోగా నిర్వ‌హిస్తామ‌ని మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్ల‌డించారు. రెజ్ల‌ర్ల‌తో తాను ఆరు గంట‌ల పాటు సంప్ర‌దింపులు జ‌రిపాన‌ని, ఈ నెల 15లోగా విచార‌ణ ముగుస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా తాను వారికి హామీ ఇచ్చాన‌ని తెలిపారు. విచార‌ణ అనంత‌రం చార్జిషీట్లు దాఖ‌లు చేస్తార‌ని చెప్పారు. ఇక లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాల‌ని రెజ్ల‌ర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే విష‌యాన్ని వారు కేంద్ర మంత్రి ముందు ప‌ట్టుప‌ట్టిన‌ట్టు స‌మాచారం. 5 డిమాండ్లతో కూడిన లిఖిత పూర్వక ప్రతిపాదనను మంత్రికి రెజ్లర్లు సమర్పించినట్టు తెలుస్తోంది.

కేంద్ర మంత్రితో సమావేశానంతరం రెజ్లర్ బజ్రంగ్ పూనియా మాట్లాడుతూ, పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించామని, పోలీసు విచారణ జూన్ 15తో పూర్తవుతుందని, అంతవరకూ ఎలాంటి నిరసన చేపట్టవద్దని మంత్రి కోరారని చెప్పారు. మహిళా రెజ్లర్ల భద్రతను తాము చూసుకుంటామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. తాము సైతం రెజ్లర్లపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలని కోరామని, అందుకు మంత్రి అంగీకరించారని చెప్పారు

బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలని, సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులకు చోటు కల్పించరాదని, రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాలక మండలికి ఎన్నికలు నిర్వహించాలని, జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతల కారణంగా తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.