ప్రవాసి భీమా లేకుండా విమానం ఎక్కొద్దు

గల్ఫ్ తో సహా 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే వలస కార్మికులు రూ.325 చెల్లిస్తే 2 సంవత్సరాల కాలపరిమితి గల రూ.10 లక్షల విలువైన  ‘ప్రవాసి భారతీయ బీమా యోజన’ (పిబిబివై) అనే ప్రమాద బీమా పాలసీ పొందవచ్చు. ఎమిగ్రేషన్ యాక్టు-1983 నిబంధనల ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లకముందే ఈ పాలసీని పొంది, ఇ-మైగ్రేట్ సిస్టం లో నమోదు చేసుకొని, ఎమిగ్రేషన్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది.

పిబిబివై లేకుండా కార్మికులు గల్ఫ్ దేశాల ప్లయిట్ ఎక్కకూడదని,  ప్రవాసి ఇన్సూరెన్స్ పాలసీ కోసం గల్ఫ్ ఏజెంట్లను కోరాలని గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ సూచించారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో మంగళవారం గల్ఫ్ వలసలపై అవగాహన, చైతన్య కార్యక్రమం నిర్వహించారు.

గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారిని, గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల  కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని కోరారు. కార్మికుల హక్కుల సాధనలో తాము అండగా ఉంటామని  భరోసా ఇచ్చారు.

1 ఆగస్టు 2017 నాడు సవరించిన నిబంధనల ప్రకారం ఈసీఎన్నార్ క్యాటగిరి పాస్ పోర్ట్ కలిగిన కార్మికులు కూడా ఈ పాలసీ పొందే వీలు ఉన్నది. రూ.10 లక్షల ప్రవాసీ బీమా విదేశాలతోపాటు, భారత్ లో కూడా వర్తిస్తుంది. యజమాని మారిన సందర్భంలో కూడా ఉపయోగపడుతుంది.  గాయాలు, అనారోగ్యం, జబ్బు, వ్యాధుల చిత్సకు రూ. ఒక లక్ష ఆరోగ్య బీమా వర్తిస్తుంది. విదేశీ ఉద్యోగ సంబంధ న్యాయ సహాయం కోసం రూ.45 వేలు, మెడికల్ అన్ ఫిట్ గాని, ఒప్పందం కంటే ముందే ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో గాని విదేశం నుండి భారత్ కు రావడానికి విమాన ప్రయాణ టికెట్టు ఇస్తారు.

ప్రమాదంలో చనిపోయినప్పుడు శవపేటికను తరలించడానికి, ప్రమాదం వలన శాశ్వత అంగవైకల్యం ఏర్పడినప్పుడు కూడా విమాన ప్రయాణ టికెట్టు ఇస్తారు. ‘ప్రవాసి భారతీయ బీమా యోజన’ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు, అదంగా తగినంత జీవిత బీమా పాలసీని కూడా తీసుకోవాలని రవిగౌడ్ సూచించారు.  ఈ కార్యక్రమంలో అల్లీపూర్ సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు బొడ్డుపెల్లి రాము, ఎలుముల భూమయ్య, దండవేని అశోక్, బుర్రి తిరుపతి, గెల్లె పోశాలు, వెంకటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.