ప్రపంచ బ్యాంకు అధ్యక్షునిగా తొలిసారి భారత సంతతి వ్యక్తి

భారతీయ అమెరికన్‌ అజరు బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ బ్యాంకు అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా బంగా నిలిచారు.  బంగా కంటే ముందు ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా డేవిడ్‌ మాల్పాస్‌ ఉన్నారు. ఈయన పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరితో మగిసింది. దీంతో మాల్పాస్‌ స్థానంలోకి అజరు బంగా వచ్చారు.

ప్రపంచ బ్యాంక్‌ 14వ అధ్యక్షుడిగా ఎన్నికైన అజరు బంగా (63) ఐదేళ్లు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజరు బంగాను నామినేట్‌ చేయనున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 3వ తేదీన వరల్డ్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు అజరుబంగాను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.

కాగా, వరల్డ్‌ బ్యాంకు అధ్యక్షుడిగా అజరు బంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రపంచ బ్యాంక్‌ ట్వీట్‌ శుక్రవారం ట్వీట్‌ చేసింది. ‘పేదరికం లేని సమాజాన్ని సృష్టించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. మీరు మాతో చేరండి’ అని అధ్యక్షుడికి స్వాగతం పలుకుతూ ప్రపంచ బ్యాంక్‌ ట్వీట్‌ చేసింది.  ఈ ట్వీట్‌కి జతగా ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యలయంలోకి అజరు బంగా ప్రవేశిస్తున్న ఫొటోను కూడా జత చేసింది.

ఇక ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా కూడా అజరు బంగాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు స్వీకరించిన అజరు బంగాకు నా శుభాకాంక్షలు. మంచి చేయడానికి, అవసరమైన వారికి సహాయం చేయడానికి మా సంస్థల మధ్య లోతైన భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను.’ క్రిస్టాలినా జార్జివా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అమెరికాలోని జనరల్‌ అట్లాంటిక్‌ అనే కంపెనీకి వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ కంపెనీ గ్లోబల్‌ గ్రోత్‌ కంపెనీలకు మూలధనం, వ్యూహాత్మక మద్దతునిస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలనందించే మాస్టర్‌ కార్డ్‌ కంపెనీకి బంగా సిఇఓగా పనిచేశారు.