గోవిందరాజస్వామి ఆలయంలో రావి చెట్టు కూలి వ్యక్తి మృతి

గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో ఆలయం ధ్వజస్తంభం వద్ద ఉన్న వందల ఏళ్లనాటి పెద్ద రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుడు కడపకు చెందిన డాక్టర్ గుర్రప్ప(70)గా గుర్తించారు.
గుర్రప్ప గతంలో స్విమ్స్‌లో వైద్యుడిగా సేవలందించారనిప్ర, స్తుతం కడపలో నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. తిరుపతి స్విమ్స్‌లో మెడిసిన్ చదువుతున్న కుమార్తెను చూసేందుకు వచ్చిన గుర్రప్ప గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యారు.

 
కాగా, తిరుమల ఘాట్ రోడ్ లో ఇటీవల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాల ఫిట్నెస్‌ను తనిఖీ చేసి కొండకు అనుమతించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. అలిపిరి చెక్ పోస్టు తోపాటు శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణాలు, శ్రీనివాస సేతు నిర్మాణ పనులను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు.

 
తిరుమలకు వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి అధునాతన యంత్ర పరికరాలు ఏర్పాటుచేసే అంశంపై నివేదిక అందించాలని సివీఎస్వో ను ఆదేశించామని చెప్పారు. అలిపిరి చెక్ పోస్టు లో వాహనాల తనిఖీ లో ఆలస్యం జరిగి భక్తులు అసహనానికి గురి కాకుండా ఉండడం కోసం వాహనాల తనిఖీ క్యూ లైన్ల సంఖ్యను పెంచనున్నట్లు ఆయన చెప్పారు.
 
చెక్ పోస్టు లో విజిలెన్స్ సిబ్బంది బాగా తనిఖీలు చేస్తున్నారని, తిరుమలకు వాటర్ బాటిల్లు తీసుకుని వెళ్లకుండా మరింత పటిష్టంగా తనిఖీలు చేయాలని సూచించారు. చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ లో పనులు ప్రారంభించారని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
 
ఈ ఏడాది చివర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, తిరుపతి వాసుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం శ్రీనివాస సేతు నిర్మాణానికి టీటీడీ 65 శాతం నిధులు అందిస్తోందని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ కు ఫ్లైఓవర్ మొత్తం పూర్తికావాల్సి ఉన్నా, సాంకేతిక కారణాలవల్ల ఆలస్యమైందని చెప్పారు. జూన్ చివరి నాటికి పనులు పూర్తి చేసి జులై లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.