నారా లోకేష్‌పై ప్రొద్దుటూరులో కోడి గుడ్ల దాడి

తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్‌పై కొందరు కోడిగుడ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ శ్రేణులు కోడిగుడ్లు విసిరిన వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.
 
 లోకేష్‌పై గుడ్ల దాడితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో అప్రమత్తమైన  పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు .
ప్రొద్దుటూరు పట్టణంలో రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్దకు లోకేష్ పాదయాత్ర రాగానే ఈ దాడి జరిగింది. ఇద్దరు యువకులు లోకేష్‌పై కోడిగుడ్లు, రాయి విసరడంతో.. ఊహించని ఈ పరిణామానికి అంతా షాకయ్యారు.
 
 కోడిగుడ్లు విసిరిన వ్యక్తులను గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వారిని వెంబడించి పట్టుకుని చితకబాదారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయినా టీడీపీ కార్యకర్తలు వారిపై దాడికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే, తాము దాడి చేయలేదని, లోకేష్ పాదయాత్ర చూడటానికి వచ్చామని ఆ ఇద్దరు యువకులు వాదిస్తున్నారు. 
ఆ ఇద్దరు యువకులు కోడిగుడ్లు విసరడాన్ని తాము చూసి పట్టుకున్నామని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇది ఆకతాయిలు చేసిన పనిగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా, దాడులకు పాల్పడి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడేలా చేయొద్దని టీడీపీ నేతలను పోలీసులు కోరారు. ఇది ఆకతాయిల చర్యగానే చూడాలని, పార్టీల మధ్య జరిగిన వివాదంగా చూడొద్దని టీడీపీ నాయకులకు పోలీసులు సర్ది చెప్పారు. దాడికి పాల్పడింది వాళ్లే అని తేలితే కచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
 
తొలుత వైఎస్  వివేకానందరెడ్డిని ఎవరు చంపారంటూ.. వైఎస్ వివేకా, సీఎం జగన్‌, కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఫొటోలను ప్రదర్శిస్తూ ‘బాబాయిని ఎవరు చంపారు?’ అని రాసి ఉన్న పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
‘బాబాయిని ఎవరు చంపారు?’ అనే నినాదాలతో లోకేష్ పాదయాత్ర పొడవునా ర్యాలీగా వెళ్లారు. నారా లోకేష్ కూడా ప్లకార్డులు పట్టుకొని పాదయాత్ర వెంట ప్రజలకు చూపించారు. ప్రొద్దుటూరు టౌన్‌లో ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్‌ని చంపింది ఎవరు? అంటూ లోకేశ్‌ స్థానిక ప్రజలను అడిగారు. ఓ సందర్భంలో ఆ పోస్టర్లను పోలీసులు లాక్కోవడంతో తెలుగు దేశం పార్టీ నాయకులు అభ్యంతరం తెలిపారు.