మే రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

మే నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలయ్యాయి. మేలో రూ.1,57,090 కోట్లుగా వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 12శాతం పెరిగిందని పేర్కొంది. గత ఏడాది రూ.1,40,885 కోట్లు వసూలయ్యాయి.
మొత్తం జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.28,411 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ కింద రూ.35,828 కోట్లు, ఐజీజీఎస్టీ కింద రూ.81,363 కోట్లు వసూలైనట్లు ఆర్థికశాఖ వివరించింది. సెస్‌ల రూపంలో మరో రూ.11,489 కోట్లుగా వసూలైనట్లు వివరించింది.
 
ఇంతకు ముందు ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. జీఎస్టీ వసూళ్ల విషయంలో ఏపీ, తెలంగాణ వృద్ధిని సాధించాయి.
 
గతేడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ రూ.3047 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు సాధించగా, ఈ ఏడాదిలో రూ.3,373 కోట్లు వసూలవగా,  11 శాతం వృద్ధి నమోదైంది. ఇక తెలంగాణ గతేడాది రూ.3982 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఈ ఏడాది మే నెలలో 13 శాతం వృద్ధితో రూ.4507 కోట్ల వసూలయ్యాయి.