దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి

2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి చెందింది. ఇదే ఏడాది చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతంగా నమోదైంది. వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు రాణించడంతో వృద్ధికి దోహదపడింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) జీడీపీ గణాంకాలను బుధవారం విడుదల చేసింది.
 
ఈ వృద్ధి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. దీనివల్ల రాబోయే కొన్ని సంవత్సరాలలో ఐదు ట్రిలియన్​ డాలర్ల లక్ష్యాన్ని సాధించడం సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.1 శాతం కాగా, 2022-23 7.2 శాతంగా నమోదైంది.
త్రైమాసికాల వారీగా చూస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 13.1 శాతం, జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.2 శాతం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 4.5 శాతం, జనవరి-మార్చి త్రైమాసికంలో ఇది 6.1 శాతం నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 7.2 శాతం వృద్ధి. ప్రపంచ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకంగా ఉందని తెలియజేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2022-23 జీడీపీ వృద్ధి గణాంకాల పట్ల ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.
 
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆశాజనకమైన పథంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ‘2022-23 జీడీపీ వృద్ధి గణాంకాలు ప్రపంచ సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను నొక్కి చెబుతున్నాయి. మొత్తం ఆశావాదం, బలమైన స్థూల ఆర్థిక సూచికలతో పాటు ఈ దృఢమైన పనితీరు మన ఆర్థిక వ్యవస్థ ఆశాజనక పథం, మన ప్రజల దృఢత్వానికి ఉదాహరణ’ అని ప్రధాని మోదీ  ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఈ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థను 3.3 ట్రిలియన్ల డాలర్లకు కొనసాగించడంతోపాటు రాబోయే కొన్ని సంవత్సరాలలో ఐదు ట్రిలియన్ల డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి వేదికను నిర్దేశించింది. 2022–-23లో ప్రస్తుత ధరల ప్రకారం నామమాత్రపు జీడీపీ వృద్ధి రేటు రూ. 234.71 లక్షల కోట్లు ( 2.8 ట్రిలియన్​ డాలర్ల) నుండి రూ. 272.41 లక్షల కోట్ల (3.3 ట్రిలియన్ డాలర్లకు) స్థాయికి చేరుకుంటుందని అంచనా.
 
కాగా, ఎన్ఎస్ఓ నుంచి వచ్చిన డేటా ఆధారంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి నిజమైన జిడిపి ధరలు రూ. 160.06 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేయబడింది. ఈ సంఖ్య గత ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ. 149.26 లక్షల కోట్ల మొదటి సవరించిన జిడిపి అంచనాలను అధిగమించింది. మరోవైపు, 2023 మొదటి మూడు నెలల్లో చైనా 4.5 శాతం ఆర్థిక వృద్ధిని మాత్రమే నమోదు చేయడం గమనార్హం.
మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో ఇండియా ఎంతో అభివృద్ధి సాధించిందని, ఆసియా, గ్లోబల్​ గ్రోత్​కూ ఊతమిచ్చిందని అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థ మోర్గన్​ స్టాన్లీ ప్రశంసించింది. ఇండియా గ్రోత్​పై విదేశీ ఇన్వెస్టర్లకు మొదట్లో చాలా అనుమానాలు ఉండేవని, అవన్నీ పటాపంచలు అయ్యాయని స్పష్టం చేసింది.
 
భారత్ తన సత్తాను వెలికితీయలేదన్న విమర్శలను కొట్టిపారేసింది. 2014 నుంచి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం..2013 నాటి ఇండియాతో ఇప్పటి ఇండియా చాలా ముందుకు వెళ్లింది. ఇంత తక్కువ సమయంలోనే ఇండియా ఆర్థిక వ్యవస్థ ఎంతో పుంజుకుంది.  ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో ఉంది.