పేపర్‌ లీక్ కేసులో కొత్తగా తెరపైకి ‘డీఈ’

కలకలం రేపుతున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీక్  వ్యవహారంలో సిట్ జరుపుతున్న దర్యాప్తులో తాజాగా విద్యుత్ శాఖకు చెందిన డీఈ వ్యవహరం తెరపైకి వచ్చింది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పేపర్‌ లీక్‌లో వరంగల్‌ జిల్లాలో పని చేస్తున్న ఎలక్ట్రిసిటీ డివిజనల్‌ ఇంజినీర్‌ (డీఈ) రమేశ్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. కోర్డులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
 
డీఈ రమేశ్ 20 మందికి పైగా పేపర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో పలువురిని గుర్తించిన సిట్ ప్రశ్నిస్తోంది. లోతుగా విచారించి కూపీ లాగే పనిలో పడింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొత్తం 46 మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా డీఈ వ్యవహరం తెరపైకి రావటంతో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
 
విద్యుత్ శాఖలో డీఈ ఉద్యోగం చేస్తూనే హైదరాబాద్ లో ఓ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షకుడిగా కూడా రమేశ్ పనిచేసేవారని సిట్ దర్యాప్తులో వెలుగుచూసింది. అక్కడి అభ్యర్థుల పరిచయాలతో లీకేజీ దందా నడిపినట్లు తేలింది.
 
ఇదే కేసులో ఇటీవల అరెస్టయిన విద్యుత్తుశాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ రవి కిషోర్‌ ద్వారా సుమారు 20 మందికి సదరు ఈడీ ఏఈ ప్రశ్నపత్రాలు విక్రయించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రూప్‌1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షల్లో టాపర్లను హైదరాబాద్‌ సిట్‌ పోలీసులు వేర్వేరుగా సిట్‌ కార్యాలయానికి పిలిచి విచారణ నిర్వహించారు.

మరోవైపు సిట్ దర్యాప్తులో సంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. అడ్డదారుల్లో పేపర్ సంపాదించిన అభ్యర్థులు పరీక్షలు రాసి టాపర్లుగా నిలిచిన విషయం విచారణలో తెలిసింది. ఏఈ పరీక్షలో టాపర్ గా నిలిచిన అభ్యర్థి చిన్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోవడం వెలుగుచూసింది.  ఏఈలో టాప్ ర్యాంక్ సాధించిన అభ్యర్థి (ఎ+బి) స్క్వేర్ అంటే కూడా చెప్పలేక దిక్కులు చూశాడని సిట్ అధికారులు అంటున్నారు. కనీస పరిజ్ఞానం లేకపోయినా పోటీ పరీక్షల్లో అడ్డదారిలో ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి టాపర్లుగా నిలిచారని సిట్ దర్యాప్తులో తేలింది.