తమిళనాడు మంత్రిపై ఐటి సోదాలు.. ఐటి బృందంపై దాడులు

తమిళనాడు రాష్ట్ర విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ సంబంధిత వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ దశలో ఐటి బృందంపై దాడులు జరిగాయి. సెంథిల్, ఆయన సోదరుడు, కొందరు బంధువులు, స్నేహితులపై ఐటి శాఖ విస్తృత దాడులు సంచలనం కల్గించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సింగపూర్, జపాన్‌లకు అధికార పర్యటనకు వెళ్లిన దశలో, రాష్ట్రంలో అధికార పార్టీ సీనియర్ నేత సబంధితుల ఇళ్లలో ఐటి దాడులు రాజకీయ ప్రకంపనలకు దారితీశాయి.

కరూర్, ఈరోడ్, కోయంబత్తూరుల్లోని వీరి నివాసాలపై ఐటి సోదాలు జరిగాయి. కాగా కరూర్‌లో ఐటి అధికారుల బృందంపై సోదాల దశలో ఓ బృందం దాడికి దిగింది. వారి వాహనాన్ని ధ్వంసం చేసింది. కొందరు జరిపిన దాడిలో గాయపడ్డ ఐటి అధికారులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. ఐటి బృందం రావడం గమనించి కొందరు ముందుగా అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో శనివారం నాడు ఐటీ అధికారులకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించడం గమనార్హం.

తన నివాసంలో ఐటి దాడులు సోదాలు జరిగాయనే వార్తలను చెన్నైలో మంత్రి సెంథిల్ ఖండించారు. తన సంబంధితులు ఇళ్లలో సోదాలను చేపట్టారని వివరించారు. సెంథిల్ బాలాజీ రాష్ట్రంలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. డిఎంకెలో సీనియర్ నేతగా ఉన్నారు. తమిళనాడులో ఏమి చేయలేని స్థితిలో బిజెపి ఇప్పుడు ఈ విధంగా ఐటితో కక్షసాధింపు చర్యలకు దిగిందని డిఎంకె వ్యవస్థాపక కార్యదర్శి , మాజీ ఎంపి ఆర్‌ఎస్ భారతీ ఆరోపించారు.
 
ఐటి అధికారులపై డిఎంకె గూండాలు దాడికి దిగారని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు కె అన్నామలై విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. అధికార డిఎంకె జులుం పెరుగుతోందని , అధికార నిర్వహణకు వచ్చిన వారి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు.
కాగా, మంత్రి సెంథిల్‌ బాలాజీని లక్ష్యంగా చేసుకొని రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సెంథిల్‌ సోదరుడితో పాటు అతని సన్నిహితుల ఇల్లు, ఆఫీసుల్లో శనివారం అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంత్రి సెంథిల్‌తో పాటు అతని సన్నిహితుల ఇండ్లలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్ర వరకు ఐటీ తనిఖీలు జరిగాయి. కరూర్‌, చెన్నై, కోయంబత్తూర్‌ల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. టాస్మాక్‌ అవుట్‌లెట్లలో అవకతవకలు జరిగాయని ఏఐఏడీఎంకే, బీజేపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకున్నది.