డబ్ల్యుటిఒ ప్యానెల్‌ తీర్పును భారత్‌ సవాల్

దిగుమతి సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) ప్యానెల్‌ తీర్పును భారత్‌ సవాలు చేసింది. నిర్దిష్టమైన సమాచార, సాంకేతిక ఉత్పత్తులపై విధిస్తున్న దిగుమతి సుంకాలు ప్రపంచ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గత నెల 17న డబ్ల్యుటిఒకి చెందిన వాణిజ్య వివాద పరిష్కార ప్యానెల్‌ తీర్పు ఇచ్చింది.

దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు), జపాన్‌, తైవాన్‌ల ఫిర్యాదుపై వివాద పరిష్కార ప్యానెల్‌ ఈ తీర్పు నిచ్చింది. ఈ తీర్పును భారత్‌ డబ్ల్యుటిఒ అప్పీలేట్‌ కమిటీ వద్ద సవాలు చేసింది. ప్యానెల్‌ అన్వేషణలు, ముగింపులు, తీర్పులు,  సిఫారసులను ఎటువంటి చట్టపరమైన ప్రభావం లేనివిగా, వ్యతిరేకించాలని, లేదా సవరించాలని భారత్‌ అప్పీలేట్‌ కమిటీని కోరింది.

నిర్దిష్టమైన సమాచార, సాంకేతిక (ఐసిటి) ఉత్పత్తులైన మొబైల్‌ ఫోన్స్‌, విడి భాగాలు, బేస్‌ స్టేషన్లు, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు, ఆప్టికల్‌ సాధనాలపై భారత్‌ విధిస్తున్న దిగుమతి సుంకాలను ఇయు 2019 ఏప్రిల్‌ 2న సవాలు చేసింది. ఈ సుంకాలు డబ్ల్యుటిఒ నిబంధనలకు విరుద్ధమని వాదించింది. అనంతరం జపాన్‌, తైవాన్‌లు ఇయు పిటిషన్‌లో భాగమయ్యాయి.

డబ్ల్యుటిఒ ప్రకారం వాణిజ్య అంశాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లైతే సభ్య దేశాలు జెనీవాలోని బహుళ- పాక్షిక కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ద్వైపాక్షిక చర్చలు జరపడం మొదటి చర్య. పరిష్కారం కాకుంటే వాణిజ్య పరిష్కార ప్యానెల్‌ను ఆశ్రయించవచ్చు.

 ఒకవేళ అప్పీలేట్‌ కమిటీ కూడా భారత్‌కు వ్యతిరేకంగా తీర్పునిస్తే భారత్‌ ఆ తీర్పుకి కట్టుబడి నిబంధనల్లో మార్పులు చేయాల్సి వుంటుందని వాణిజ్య నిపుణులు పేర్కొన్నారు.