స‌త్యేంద‌ర్ జైన్‌కు తాత్కాలిక బెయిల్

ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత స‌త్యేంద‌ర్ జైన్‌ కు సుప్రీంకోర్టు శుక్రవారం తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. మెడిక‌ల్ గ్రౌండ్‌పై ఆ బెయిల్ ఇస్తున్న‌ట్లు కోర్టు చెప్పింది. ఆరోగ్యం క్షీణించిన జైన్ ప్ర‌స్తుతం ఢిల్లీలోని లోక్ నాయ‌క్ హాస్పిట‌ల్ ఐసీయూలో ఆక్సిజ‌న్ స‌పోర్ట్‌పై చికిత్స పొందుతున్నారు.
 
ఆరు వారాల పాటు బెయిల్ మంజూరీ చేస్తున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది. అయితే కొన్ని ష‌ర‌తులు విధించింది. బెయిల్ తీసుకున్న స‌మ‌యంలో స‌త్యేంద‌ర్ జైన మీడియాతో మాట్లాడ‌రాదు అని, ఢిల్లీ విడిచి వెళ్ల‌రాదు అని ఆదేశించింది.  తీహార్ జైలులోని బాత్‌రూంలో గురువారం ఉద‌యం మాజీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ కుప్ప‌కూలిన ఆయ‌న్ను అనంత‌రం దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
 
అనంతరం శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న సత్యేంద్ర జైన్‌ను లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్  ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ వైద్యులు ఆయ‌న‌కు ఆక్సిజ‌న్ స‌పోర్ట్ అందించారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో సత్యేంద‌ర్ జైన్‌ను ఆస్ప‌త్రికి తీసుకురావ‌డం ఈ వారంలో ఇది రెండవ‌సారి.
 
గురువారం ఉద‌యం ఆరు గంట‌ల స‌మ‌యంలో సెల్ నెంబ‌ర్ 7లోని బాత్‌రూంలో జైన్ కుప్ప‌కూలార‌ని తీహార్ జైల్ డీజీ తెలిపారు. దీంతో ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ ప‌లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించార‌ని చెప్పారు. స‌త్యేంద‌ర్ జైన్‌కు వెన్నెముక స‌ర్జ‌రీ చేయాల్సి ఉంద‌ని ఆయ‌న తెలిపారు.మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో గ‌త ఏడాది ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి మాజీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ ఏకంగా 35 కిలోల బ‌రువు త‌గ్గార‌ని ఆప్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి, పీఎస్ న‌ర్సింహ‌ల‌తో కూడిన ధ‌ర్మాసనం బెయిల్ ఇచ్చింది. జూలై 11వ తేదీ వ‌ర‌కు బెయిల్ అమ‌లులో ఉంటుంది. ఆ స‌మ‌యంలో ఆయ‌న ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొంద‌వ‌చ్చు అని ఇవాళ ధ‌ర్మాస‌నం తెలిపింది.