మోదీ నచ్చినా, నచ్చకున్నా ప్రజాస్వామ్య దేవాలయాన్ని గౌరవించాలి

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించడంపై  మరోసారి ఆలోచించుకోవాలని  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, ప్రజల ప్రయోజనాల కోసం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆమె హితవు చెప్పారు.

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని ప్రకటించిన విపక్ష పార్టీలను ఉద్దేశించి  “మీకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నచ్చినా నచ్చకపోయినా, ఆయనను చూడడం ఇష్టం ఉన్నా.. లేకపోయినా, మీరు ప్రజాస్వామ్య దేవాలయాన్ని గౌరవించాల్సిందే”నని నిర్మల సీతారామన్ తేల్చిచెప్పారు.

ప్రజల సమస్యలపై చర్చించే ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరించడం మంచిది కాదని ఆమె సూచించారు. విపక్షాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ ఆమె సూచించారు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, మోదీ  కూడా పార్లమెంట్ లోపలకి నమస్కరించి అడుగు పెడతారని ఆమె గుర్తు చేశారు.

పార్లమెంటుపై ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష పార్టీలు గైర్హాజర్ అవుతామని బహిరంగ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రారంభోత్సవానికి తమిళనాడు నుండి 20 మంది ఆదీనాలు, లేదా మఠాల అధిపతులను ఆహ్వానించినట్టు సీతారామన్ తెలిపారు.

తమిళ రాజ్యాలలో పాలనా చిహ్నం అయిన సెంగోల్ స్పీకర్ సీటు సమీపాన ఏర్పాటు చేయబడుతుంది అని ఆమె చెప్పారు. రాష్ట్రపతిని కేంద్ర ప్రభుత్వం అగౌరవ పరచింది అన్న ఆరోపణ తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని కేంద్ర మంత్రి చెప్పారు.  తాము రాష్ట్రపతికి తగిన గౌరవం ఇస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ఎన్నిక సమయంలో గిరిజన నేపథ్యమున్న మహిళగా రాష్ట్రపతి గురించి ఎవరెవరు ఏం మాట్లాడారో తమకు ఇంకా గుర్తుందని నిర్మల సీతారామన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి గురించి ఎవరు ఎన్ని దుర్భాషలాడుతూ మాట్లాడారో తనకు తెలుసని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పుడు అలాంటి వారంతా రాష్ట్రపతికి అవమానం జరుగుతోందని మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రజల కోసమైనా ప్రతిపక్ష పార్టీలు తమ నిర్ణయాన్ని మార్చుకుని ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని నిర్మలా సీతారామన్ సూచించారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ  చొరవ కారణంగానే కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం జరిగింది కనుకనే కొత్త పార్లమెంటు భవనాన్ని ఆయన ప్రారంభించడాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయని బిజెపి ఆరోపించింది.