నో ఫ్లై జాబితాలో పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ ప్రభుత్వం నుండి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే అరెస్టయిన ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టు జోక్యంతో అతికష్టంమీద విడుదలయ్యారు. ప్రధానిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆయనపై 150 వరకు కేసులు నమోదయ్యాయి. తాజాగా, ఇమ్రాన్ ఖాన్ దేశం విడిచి పారిపోకుండా నో ఫ్లై జాబితాలో  అక్కడి ప్రభుత్వం ఆయన పేరు చేర్చింది.

ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఇమ్రాన్ పార్టీ పీటీఐకి చెందిన పలువురు నేతల పేర్లను కూడా ప్రభుత్వం నో ఫ్లై జాబితాలో పొందుపరిచారు.  దీనిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్ ఇతర దేశాల్లో తనకేమీ ఆస్తులు, వ్యాపారాలు లేవని, బ్యాంక్ అకౌంట్లు అంతకన్నా లేవని ఎద్దేవా చేశారు. తనను నో ఫ్లై జాబితాలో చేర్చినందుకు కృతజ్ఞతలు అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యంగ్యం ప్రదర్శించారు. విదేశాలకు వెళ్లే ఆలోచన తనకి లేదని తేల్చి చెప్పారు.

‘నాకు విదేశాలకు వెళ్లే ఆలోచన లేదు. నా పేరును ఇసిఎల్‌లో ఉంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే నాకు విదేశాలలో ఎటువంటి ఆస్తులు లేవు. వ్యాపారాలు లేవు. కనీసం దేశం వెలుపల బ్యాంకు ఖాతా కూడా లేదు. ఒకవేళ నాకు అవకాశం వచ్చినప్పుడు ఉత్తర పర్వతాలకు వెళతాను. భూమిపై నాకు ఇష్టమైన ప్రదేశం అదే’ అని ఇమ్రాన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, పాక్‌లో అంతర్గత మంత్రిత్వశాఖచే నిర్వహించబడుతున్న ఇసిఎల్‌కు కోర్టు కేసుల వల్ల కానీ, ఇక ఇతర కారణాల వల్ల కానీ వ్యక్తులు దేశం విడిచి వెళ్లకుండా నిషేధించే అథారిటి ఇసిఎల్‌కు ఉంది. ఖాన్‌తోపాటు, అతని భార్య, ఆ పార్టీకి చెందిన 80 మందిని దేశం విడిచివెళ్లకుండా పాకిస్తాన్‌ ప్రభుత్వం నిషేధించిందని సమా న్యూస్‌ ఛానెల్‌ వెల్లడించింది.

మరోవంక, ఇక మే 9న జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని, పీటీఐ పార్టీపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ ప్ర‌క‌టించారు.