ఇస్లాంలో పిల్లల సంరక్షణ బాధ్యత తండ్రిదేనన్న ఏపీ హైకోర్టు
మే 25, 2023
నిర్ణీత వయసు దాటిన తర్వాత అత్తమామల సంరక్షణ నుంచి పిల్లల్ని తండ్రి తీసుకెళ్లడం కిడ్నాప్ కిందకు రాదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం తండ్రి తన పిల్లలకు చట్టబద్దమైన సంరక్షకుడని స్పష్టం చేసింది. అత్తమామల వద్ద ఉన్న పిల్లలను తీసుకెళ్లిన తండ్రి, ఆయన బంధువుపై పోలీసులు ఐపీసీ 363 ప్రకారం కిడ్నాప్ కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
పోలీసులు చిన్నారుల తండ్రిపై నమోదు చేసిన కేసును కొట్టేసింది. సున్నీ మహ్మదీయ చట్టం ప్రకారం పిల్లలకు తండ్రి చట్టబద్ధ సంరక్షకుడని గుర్తు చేసింది. ఇస్లాం అనుసరించే వారిలో పిల్లలపై తల్లి హక్కు అపరిమితమైనది కాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పు వెలువరించారు.
భర్తతో విభేదాల నేపథ్యంలో తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్న పిల్లలను భర్త, మరొకరితో కలిసి కిడ్నాప్ చేశారని మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు 2022 సెప్టెంబరు 24న కేసు నమోదు చేశారు. తమపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ పిల్లల తండ్రి, మరొకరు హైకోర్టును ఆశ్రయించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్లపై నమోదు చేసిన కిడ్నాప్ కేసు చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. దేశంలో అనుమతించిన చట్టాల ప్రకారం సున్నీ మహ్మదీయ చట్టం ప్రకారం కుమారుడికి ఏడు, షియా మహ్మదీయ లా ప్రకారం రెండేళ్లు వచ్చేంత వరకు మాత్రమే తల్లి సంరక్షణలో ఉంచుకోగలదని పేర్కొన్నారు.
సున్నీ మహ్మదీయ చట్ట ప్రకారం మైనర్లకు తండ్రి సహజ, ప్రాథమిక సంరక్షకుడని పేర్కొన్నారు. అత్తమామల నుంచి పిల్లలను తీసుకెళ్లిన సమయంలో ఒకరికి 8, మరొకరికి 10 ఏళ్లు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వరుణ్ గుర్తు చేశారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. మహ్మదీయ చట్టాల్లోని నిబంధనల ప్రకారం కొంత వయసు వరకే పిల్లలకు తల్లి సంరక్షకురాలిగా ఉంటారని తెలిపారు. నిర్ధిష్టమైన వయసు మించిన పిల్లలకు తండ్రి సహజ, చట్టబద్ధ సంరక్షకుడవుతారని స్పష్టం చేశారు. చట్టబద్ధ సంరక్షకుడు పిల్లల్ని తీసుకెళ్లడాన్ని కిడ్నాప్‌గా పరిగణించలేమని స్పష్టం చేశారు. గుత్తి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేస్తున్నట్లు ప్రకటించారు.
More Stories
ఆసక్తి కలిగిస్తున్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ
తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు
నారా లోకేష్‌పై ప్రొద్దుటూరులో కోడి గుడ్ల దాడి