‘కునో’నేషనల్ పార్క్‌లో వరుసగా చీతాలు మృతి

కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీతాలో వరుసగా చీతాల మరణాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందగా, గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయని అటవీ అధికారులు తెలిపారు. గత మూడు రోజుల్లో మూడు మృతి చెందాయని చెప్పారు. ఈనెల 23 మంగళవారం ఒక చిరుత పిల్ల మృతి చెందగా, మరో రెండు అదే రోజు మధ్యాహ్నం మృతి చెందాయి. కానీ ఈ మరణాల సంఖ్యను గురువారం వెల్లడించారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి కునో పార్కుకు తీసుకు వచ్చిన జ్వాలా గత మార్చి నెలాఖరులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. వీటిని పర్యవేక్షిస్తున్న అధికారులు ఈనెల 23 న మూడు పిల్లల పరిస్థితి బాగా లేదని గుర్తించారు. వెంటనే చికిత్స చేయించి రక్షించాలని ప్రయత్నించారు. ఆనాడు పగటి ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉన్నాయి.

చికిత్స అందించినా అవి బతకలేదని అధికారులు చెప్పారు. నాలుగో చిరుత పిల్ల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అయినా పూర్తి వైద్య చికిత్సలోనే ఉందని తెలిపారు. పర్యవేక్షక బృందం పార్క్‌లో పరిశీలించినప్పుడు చాలా బలహీనంగా కనిపించడంతో వెటర్నరీ వైద్యులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించినట్టు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ తెలిపారు.

అయితే, ఆసుపత్రికి తరలించిన ఐదు పది నిమిషాలకే ఒకటి మరణించినట్టు చెప్పారు.  చాలా బలహీనంగా ఉండడం వల్లే అది మరణించినట్టు పేర్కొన్నారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. చీతా జ్వాల (సియాయా) మార్చి 24న నాలుగు కూనలకు జన్మనిచ్చింది. వీటితో కలిపి చీతాల సంఖ్య 24కు పెరిగింది.

1948లో మధ్యప్రదేశ్‌ (ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌) రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో చిరుతల ( ఓ రకమైన) ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. దీంతో వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 75 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియాతో పాటు దక్షిణాఫ్రికా 20 చిరుతలను కునో నేషనల్‌ పార్క్‌కు కేంద్రం తరలించగా.. గతేడాది ప్రధాని తన పుట్టిన రోజున సందర్భంగా వాటిని ఎన్‌క్లోజర్‌లోకి వదిలారు. ఇప్పటి వరకు సాషా, దక్ష అనే ఆడ చిరుతలతో పాటు ఉదయ్‌ అనే మగ చిరుత ఇటీవల మరణించాయి. జ్వాలాకు జన్మించిన నాలుగు పిల్లల్లో మూడు మృతి చెందాయి. ప్రస్తుతం ప్రస్తుతం కునోలో 17 చిరుతలు, ఒక పిల్ల మిగిలింది.