ఐదు నెలల్లో రెండు లక్షల ఉద్యోగులపై టెక్ కంపెనీల వేటు

టెక్‌ కంపెనీలు గతేడాది నుంచి ఉద్యోగుల కోత విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది 1056 కంపెనీలు దాదాపు 1.64 లక్షల మంది ఉద్యోగులను తొలగించగా,2023 కేవలం ఐదు నెలల్లోనే ఈ సంఖ్య దాటిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
 
లేఆఫ్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ లేఆఫ్‌.ఎఫ్‌వైఐ వివరాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ 696 టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు కోత విధించాయి. ఈ ఏడాది మే 18 నాటికి దాదాపు 1,97,985 మంది టెక్‌ కంపెనీల ఉద్యోగస్తులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. ఇప్పటికే ఆరువేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు మెటా ప్రకటించింది.
 
అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ట్విట్టర్‌ వంటి టెక్‌ దిగ్గజాలు లేఆఫ్స్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్‌ టేకోవర్‌ చేసిన అనంతరం ఎడాపెడా లేఆఫ్స్‌ కొనసాగుతూనే ఉంది. భారత్‌లో పనిచేసే ట్విట్టర్‌ ఉద్యోగులందరినీ ఆ కంపెనీ తొలగించింది.
 
ఇక రాబోయే నెలల్లో గూగుల్‌, మెటా, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించాయి. ఇక భారత్‌లో పలు టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులకు కత్తెర వేస్తున్నాయి. డుంజో, షేర్‌చట్‌, రెబెల్‌ ఫుడ్స్‌, భారత్‌ అగ్రి, ఓలా వంటి పలు కంపెనీలు లేఆఫ్స్‌కు తెరలేపాయి. యాక్సెంచర్‌ భారత్‌ విభాగంలోనూ పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించారు.