ప్రధాని డిగ్రీ వివాదంలో కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు

ఢిల్లీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌కు అహ్మదాబాద్‌ కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. జూన్‌ 7న ఇద్దరు నేతలు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ అకడమిక్‌ డిగ్రీపై గుజరాత్‌ యూనివర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.

ఇద్దరు నేతలను మంగళవారం కోర్టుకు హాజరుకావాలని గతంలో సమన్లు జారీ చేయగా నేతలెవరూ కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలో సమన్లు అందినట్లుగా కనిపించడం లేదని కోర్టుకు తెలుపడంతో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌లకు నోటీసులు జారీ చేసింది.

అయితే, కేజ్రీవాల్‌, సింగ్‌లకు కోర్టు జారీ చేసిన సమన్లు ఇంకా అందలేదని ఆప్‌ గుజరాత్‌ లీగల్‌ సెల్‌ హెడ్‌ ప్రణవ్‌ ఠక్కర్‌ తెలిపారు. ప్రధాని మోదీ డిగ్రీ అర్హతను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌ గుజరాత్‌ యూనివర్సిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, ఉద్దేశపూర్వకంగా గుజరాత్‌ యూనివర్సిటీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించారని వర్సిటీ రిజిస్ట్రార్‌ క్రిమినల్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

‘అక్కడ ఒకవేళ డిగ్రీ కాగితాలుంటే వర్సిటీ ఎందుకు బయట పెట్టడం లేదు. ఫేక్‌ సర్టిఫికెట్‌ కాబట్టే వర్సిటీ బయటపెట్టడం లేదేమో! ప్రధాని తమ విద్యార్థి అని ఢిల్లీ, గుజరాత్‌ యూనివర్సిటీలు చెప్పుకునేవి కదా!’ అని కామెంట్ చేశారు. ‘ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ నకిలీదని వర్సిటీ నిరూపించింది’ అంటూ సంజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించగా గుజరాత్‌ వర్సిటీ కోర్టులో పరువు నష్టం కేసు నమోదు చేసింది.