దగ్గు సిరప్‌ల ఎగుమతులపై ఆంక్షలు

గతేడాది గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లో భారత్‌లో తయారైన దగ్గు సిరప్‌ల వల్ల పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ దగ్గు సిరప్‌ల నాణ్యతపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విదేశాలకు ఎగుమతి చేసే దగ్గు సిరప్‌లపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధన విధించింది. విదేశాలకు ఎగుమతి చేసే దగ్గు సిరప్‌ల్ని తప్పనిసరిగా ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే వాటిని ఎగుమతి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది.
 
ఇకపై ‘ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే దగ్గు సిరప్‌లను ప్రభుత్వ ల్యాబ్‌లు పరీక్షిస్తాయి. పరీక్షించిన తర్వాత ఎగుమతి నమూనాల ధృవీకరణ పత్రాన్ని ల్యాబ్‌లు అందజేస్తాయి. ఈ ధృవీకరణ పత్రం జారీచేసిన తర్వాతే దగ్గు సిరప్‌లు ఎగుమతి చేయబడతాయని’ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫోర్జిన్‌ ట్రేడ్‌ (డిజిఎఫ్‌టి) సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ కొత్త నిబంధన జూన్‌ 1, 2023 నుండి అమల్లోకి రానుందని డిజిఎఫ్‌టి వెల్లడించింది.
 
భారత్‌ నుండి ఎగుమతి అయ్యే వివిధ ఔషధ ఉత్పత్తుల నాణ్యతకు భరోసా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధన విధించినట్లు ఓ అధికారి తెలిపారు.  ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన వల్ల దగ్గు సిరప్‌లు ఎగుమతి చేయడానికి అనుమతించే ముందు ల్యాబ్‌లలో తప్పనిసరిగా పరీక్షించబడుతుందని ఆ అధికారి వెల్లడించారు.
 
డిజిఎఫ్‌టి నోటిఫికేషన్‌ వెల్లడించినట్లుగా.. టెస్టింగ్‌ ఆవశ్యకతను సజావుగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఈ నోటిఫికేషన్‌ను సజావుగా అమలు చేసేందుకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, ఎగుమతిదారులతోనూ భాగస్వామిగా వ్యవహరించనుందని ఆ అధికారి తెలిపారు.
ప్రస్తుతం ఇండియ‌న్ ఫార్మ‌కోపోయియా క‌మిష‌న్, ఆర్‌డీటీఎల్ – చండీఘ‌ర్, సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ ల్యాబ్ – కోల్‌క‌తా, సెంట్ర‌ల్ డ్ర‌గ్ టెస్టింగ్ ల్యాబ్ – చెన్నై, హైద‌రాబాద్, ముంబై, ఆర్‌డీటీఎల్ – గువ‌హ‌టితో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌చే గుర్తింపు పొందిన‌ ఎన్ఏబీఎల్ వంటి ల్యాబ్‌ల్లో ద‌గ్గు సిర‌ప్‌ల‌ను ప‌రీక్షించేందుకు అవ‌కాశం క‌ల్పించారు.