జగదీష్‌ టైట్లర్‌పై సిబిఐ ఛార్జిషీట్‌

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ నేత జగదీష్‌ టైట్లర్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ‘నవంబర్‌ 1, 1984న ఢిల్లీలోని బారా హిందూ రావ్‌లోని ఆజాద్‌ మార్కెట్‌లో గల గురుద్వారా పుల్‌ బంగాష్‌లో ఒక గుంపు నిప్పంటించడం, సర్దార్‌ ఠాకూర్‌ సింగ్‌, బాదల్‌ సింగ్‌, గురుచరణ్‌ సింగ్‌ అనే ముగ్గురు వ్యక్తులు నిప్పంటుకొని చనిపోయిన సంఘటనపై సిబిఐ 2005, నవంబర్‌22న కేసు నమోదు చేసింది” అని సిబిఐ ప్రతినిధి గుర్తు చేశారు.

అక్టోబరు 31, 1984న అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు హత్య చేయడంతో ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. కొంతమంది కాంగ్రెస్‌ నాయకుల సహాయంతో ఆరోపిత మూకలు సిక్కులపై దాడి చేసి వారి ఇండ్లను తగులబెట్టారు. ఒక్క ఢిల్లీలోనే దాదాపు 3,000 మంది సిక్కులు హతమయ్యారు.

1984 నవంబర్‌ 1న టైట్లర్‌ ఆ ప్రాంతంలోని దుకాణాలను తగలబెట్టడం, లూటీ చేయడంతో పాటు గురుద్వారాను తగలబెట్టి, ముగ్గురు సిక్కులను హతమార్చిన గుంపును ప్రేరేపించి, రెచ్చగొట్టి చంపినట్టు సిబిఐ దర్యాప్తులో తేలిందని సదరు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద అల్లర్లు, హత్య ఆరోపణలపై ఏజెన్సీ టైట్లర్‌పై కేసు నమోదు చేసిందని అధికారులు తెలిపారు. జూన్‌ 2న అభియోగాలను కోర్టు పరిశీలిస్తుందని వారు తెలిపారు.