అభిషేక్ బెనర్జీకి సీబీఐ సమన్లు

పశ్చిమబెంగాల్‌లో స్కూలు ఉద్యోగాల కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శుక్రవారంనాడు సమన్లు పంపింది. శనివారం ఉదయం 11 గంటలకు తమ ముందు విచారణకు హాజరుకాలని ఆదేశించింది.
 
ఈ విషయాన్ని అభిషేక్ బెనర్జీ ధ్రువీకరించారు. సీబీఐ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ”ఈనెల 20వ తేదీన విచారణకు రావాలని సీబీఐ జారీ చేసిన సమన్లు అందాయి. కనీసం ఒకరోజు ముందైనా నోటీసు ఇచ్చి ఉండాల్సింది. అయినా సరే సమన్లకు కట్టుబడి ఉంటాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను” అని అభిషేక్ బెనర్జీ ఓ ట్వీట్‌లో తెలిపారు.

తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమబెంగాల్‌లో రెండు నెలల పాటు చేపట్టిన మెగా ఈవెంట్ ‘జన్ సంజోగ్ యాత్ర’కు అభిషేక్ బెనర్జీ సారథ్యం వహిస్తున్నారు. గత ఏప్రిల్ 25న ఈ యాత్ర ప్రారంభమై ముందుకు సాగుతోంది. కాగా, శనివారంనాడు బంకురాలో యాత్ర జరుగుతోందని, సీబీఐ సమన్ల నేపథ్యంలో ఈనెల 22 నుంచి తిరిగి బంకురా నుంచే యాత్రలో పాల్గొంటానని అభిషేక్ చెప్పారు.

 పశ్చిమ బెంగాల్ కు ప్రజలకు సేవ చేయాలనే దృఢ నిశ్చయం నుంచి వెనక్కు తగ్గేది లేదని చెప్పారు. బంకూరు యాత్రలో ప్రజలను ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ, ప్రజలు తన కోసం రోడ్లపైకి రానవసరం లేదని, 100 రోజుల పనిదినాలు హక్కుతో సహా తమ హక్కుల సాధనకు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు.