కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను వర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆహ్వానించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మే 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. అందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
అంతకు ముందు గురువారం సాయంత్రం కేపీసీసీ కార్యాలయంలోని ఇందిరాగాంధీ సభా భవన్‌లో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సిద్ధరామయ్య శాసనసభా పక్ష నేతగా అధికారికంగా ఎన్నికయ్యారు. సీఎల్పీ నేతగా సిద్ధరామయ్య పేరును ఎమ్మెల్యేగా ఉన్న డీకే శివకుమార్ ప్రతిపాదించారు. దీన్ని డాక్టర్ పరమేశ్వర్, హెచ్‌కే పాటిల్, ఎంబీ పాటిల్, దేశ్‌పాండే, లక్ష్మీ హెబ్బాల్కర్, తన్వీర్ సేథ్, కేహెచ్ మునియప్ప బలపర్చారు.
ఆ వెంటనే సీఎల్పీ నేత సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్ గెహ్లాట్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇక శనివారం మధ్యాహ్నం 12.30కి కంఠీరవ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధూ కేబినెట్‌లో 20 నుంచి 25 మంది దాకా మంత్రులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కర్ణాటక ప్రజల కోసం అంకిత భావంతో కట్టుబడి పనిచేస్తామని తమ ఎంపిక తరువాత సిద్ధరామయ్య, డికెలు ప్రకటించారు. కన్నడిగుల ప్రయోజనాల పరిరక్షణకు తాము సర్వదా సంఘటితంగా ఉంటామని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని సిద్ధరామయ్య భరోసా ఇచ్చారు.
కాగా, సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆహ్వానించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ పవా ర్, బెంగాల్ సీఎం మమత, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితర నేతలకు ఆహ్వానం పంపారు.
జనతా పార్టీ కుటుంబం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సిద్ధరామయ్య ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధి. కానీ జేడీఎస్ అగ్రనేత దేవెగౌడతో విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి 2006లో సస్పెండ్ అయ్యారు. అనంతరం తాను తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే చేరి 2008 ఎన్నికల్లో గెలిచి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. 2013లో మొదటిసారి సీఎం అయ్యారు.
రాజకీయాల్లో ధన బలాన్ని తట్టుకోలేక ఒకానొక దశలో రాజకీయ సన్యాసం తీసుకొని తిరిగి న్యాయవాదిగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. మైసూర్ విశ్వ విద్యాలయం నుంచి బీఎస్సీ, లా డిగ్రీ పూర్తి చేసిన సిద్ధరామయ్య రాజకీయాల్లోకి రాక ముందు కొంత కాలం న్యాయవాదిగా, అతిథి అధ్యాపకులుగా పని చేశారు. ఇప్పటి వరకు సిద్ధరామయ్య తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కాగా, ప్రమాణశ్వీకారంకు ముందే కర్ణాటక కాంగ్రెస్ లో విబేధాలు గుప్పుమంటున్నాయి. ఈ ఏర్పాటు పట్ల సంతోషంగా లేమని డీకే శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ స్పష్టం చేశారు. మరోవంక, అధిష్ఠానం కర్ణాటకలో దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవని దళిత నేత, మాజీ డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర హెచ్చరించారు.
తానొక్కడినే డిప్యూటీ సీఎంగా ఉండాలని శివకుమార్ అధిష్ఠానానికి నిబంధన విధించారన్న వార్తలపైనా స్పందిస్తూ ‘ఆయన కోణంలో అది సరైందే కావచ్చు. కానీ హైకమాండ్ దృష్టి కోణం విభిన్నంగా ఉండాలి. డిప్యూటీ సీఎం పోస్టుపై దళిత వర్గం ఎన్నో ఆశలు పెట్టుకుందన్న విషయాన్ని గుర్తించాలి. వారికి న్యాయం చేశామా లేదా అనే విషయాన్ని ఆలోచించాలి’ అని హితవు చెప్పారు.
దళితుల ఆకాంక్షలను అర్థం చేసుకోలేకపోతే సహజంగానే దానికి తగిన విధంగా ప్రతిస్పందన ఉంటుందని, దీని గురించి అధిష్ఠానానికి చెప్పాల్సిన బాధ్యత తనకుందని ఆయన తెలిపారు.
More Stories
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత