
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గురువారం న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే న్యాయవ్యవస్థతో ఎలాంటి ఘర్షణ లేదని, అందరికీ సత్వర న్యాయం జరిగేలా చూడడమే తన ప్రాధాన్యత అని ఆయన ప్రకటించారు.
కిరణ్ రిజిజును న్యాయ శాఖ నుండి ఎర్త్ సైన్సెస్ శాఖకు బదిలీ చేసి, అర్జున్ రామ్ మేఘవాల్ కు అప్పగించారు. కేబినెట్‌లో మార్పులు సహజసిద్ధం చెబుతూ తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు ప్రధానికి తాను కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని చెప్పారు. రాజ్యాంగం ఓ పెద్ద గ్రంధం, మనకు అవసరం అయిన ప్రతి విషయాన్ని రాజ్యాంగం తెలియచేస్తుందని తెలిపారు.
పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్న మేఘ్వాల్ ‘అందరికీ సత్వర న్యాయం జరిగేలా చూడటమే నా ప్రాధాన్యత’అని చెప్పారు. మేఘవాల్ డిసెంబర్ 20, 1953న రాజస్థాన్‌లోని బికనీర్‌లో సంప్రదాయ నేత కార్మికుల కుటుంబంలో జన్మించారు. పనా దేవిని వివాహం చేసుకోగా, ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆయన మాజీ సివిల్ సర్వీస్ అధికారి. మేఘవాల్ ఎంబీఏ డిగ్రీతో పాటు లాలో బ్యాచిలర్ డిగ్రీ, పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేశారు. 1982లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. 2009లో రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి 15వ లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 2010 నుంచి మేఘవాల్ బిజెపి జాతీయ కార్యవర్గంలోకి ఉన్నారు.
పార్టీ రాజస్థాన్ శాఖ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. 69 ఏళ్ల ఆయన ప్రస్తుతం మూడోసారి ఎంపీగా కొనసాగుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తనకు న్యాయ శాఖ ఇచ్చినట్లు చెప్పడాన్ని కేవలం ఊహాగానమే అని కొట్టిపారేశారు.
కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థకు మధ్య సత్సంబంధాలు ఉండనే ఉన్నాయని చెబుతూ ఇవి రాజ్యాంగపరంగా కొనసాగుతాయని తెలిపారు. ఇక వీటి పరిమితులకు సంబంధించిన స్పష్టమైన రేఖలు ఉండనే ఉన్నాయని స్పష్టం చేశారు. 2014 ఎన్నికలకు ముందు, బికనీర్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా “చట్టవిరుద్ధమైన” భూ ఒప్పందాలను బయటకు తీయడంతో మేఘవాల్ మరింత ప్రాముఖ్యతను పొందారు.
ఆ సంవత్సరం కేంద్రంలో బిజెపి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు, మేఘవాల్ మూడు లక్షల ఓట్ల భారీ తేడాతో కాంగ్రెస్‌కు చెందిన శంకర్ పన్నును ఓడించి లోక్‌సభలో బిజెపి చీఫ్ విప్ అయ్యారు. 2016లో, మేఘవాల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే