జెనరిక్ మందులనే రోగులకు సిఫార్స్ చేయాలి

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతి దవాఖాన, వెల్‌నెస్‌ సెంటర్లు ఇక నుంచి తప్పక చవకగా లభించే జనరిక్‌ మందులనే రోగులకు సిఫార్సు చేయాలని, అలా ప్రిస్ర్కైబ్‌ చేయని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

‘ప్రభుత్వ దవాఖానాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద నడిచే స్వస్థత కేంద్రాలు, పాలిక్లినిక్‌లు ఇక నుంచి రోగులకు జనరిక్‌ మందులను మాత్రమే రాయాలి. కొంతమంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ప్రసిద్ధి చెందిన కంపెనీల మందులను మాత్రమే రోగులకు ప్రిస్ర్కైబ్‌ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇక ముందు నుంచి అలాంటి వారిపై ఉన్నతాధికారుల నిఘా ఉంటుందన్న విషయాన్ని మరవొద్దు’ అంటూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డాక్టర అతుల్‌ గోయల్‌ తన ఆదేశాలలో పేర్కొన్నారు.

తమ ఆధ్యర్యంలోని డాక్టర్లు జనరిక్‌ మందులే రోగులకు సిఫార్సు చేసేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన డాక్టర్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

గతంలో లాగ పెద్ద సంఖ్యలో ప్రైవేట్‌ మందుల కంపెనీల ప్రతినిధులు దవాఖానాలకు వచ్చే సంప్రదాయానికి స్వస్తి పలకాలని, పరిమిత సంఖ్యలోనే వారికి అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. కొత్తగా తయారైన మందుల గురించిన సమాచారాన్ని వారు డాక్టర్లకు ఈ-మెయిల్‌ ద్వారా మాత్రమే తెలియజేయాలని అతుల్‌ గోయల్‌ సూచించారు.