పొత్తులకై బిఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ వైపు సిపిఐ!

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గెలుపుకోసం వామపక్షాలను దగ్గరకు తీసుకొని, వారి మద్దతుతో గట్టెక్కిన తర్వాత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తిరిగి తమవైపు చూడకపోవడంతో వామపక్షాలతో అసహనం వ్యక్తం అవుతుంది. ఆ తర్వాత ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ సదస్సులో వామపక్ష నేతలను ఆహ్వానించడం ద్వారా జాతీయస్థాయిలో వారి మద్దతు తనకు ఉంటుందనే సంకేతం ఇచ్చేందుకు ప్రయత్నించారు.

అయితే, తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా, పొత్తులగురించి కేసీఆర్ మాట్లాడక పోవడంతో వామపక్షాలకు దిక్కుతోచడం లేదు. బిఆర్ఎస్ ఇచ్చే సీట్లను బట్టి 15 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలలో చట్టసభలలో లేని ప్రాతినిధ్యం పొందాలని చూస్తున్నా సీట్లు వదిలే ఉద్దేశం ఆయనలో కనిపించడం లేదు.

దానితో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొంటే ఒకటో, రెండో సీట్లు గెల్చుకోవచ్చనే అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతుంది.  ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ చేసిన వాఖ్యలు  ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తెలంగాణ పొత్తులపై పునరాలోచిస్తున్నామని, కర్నాటకలో 212 సెగ్మెంట్లలో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని చెప్పారు. దీనిపై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నారాయణ వెల్లడించారు.

దీంతో మొన్నటి వరకు బీఆర్ఎస్ తో చెట్టపట్టాలేసుకొని తిరిగిన సీపీఐ ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తి కోసం సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతుంది.  సీపీఐతో కలిసి పనిచేసే విషయంలో సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారని, ప్రత్యామ్నాయాలు వెతకడానికి ముందు ఆయన స్పందన కోసం మరికొన్ని రోజులు వేచి చూస్తామని నారాయణ చెప్పారు.

మునుగోడు  ఉప ఎన్నికల సమయంలో రెండు బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ బీజేపీని ఓడించేందుకు భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత మాట్లాడక పోవడంతో పరోక్షంగా నారాయణ హెచ్చరిక చేసినట్లయింది. వామపక్షాలతో పొత్తు విషయం కేసీఆర్ తేల్చని పక్షంలో కాంగ్రెస్ వైపు వెడతామని స్పష్టం చేసినట్లయింది.