కోహినూర్ వజ్రం కోసం భారత్ దౌత్యాప్రయత్నం!

బ్రిటన్‌లోని మ్యూజియంల నుంచి కోహినూర్ వజ్రం, పురాతన విగ్రహాలు, శిల్పాలతో సహా ఇతర కళాఖండాలను తిరిగి తీసుకొచ్చేందుకు దౌత్య మార్గాలను భారత్ సమీకరించినట్లు బ్రిటిష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. యూకే నుంచి వేలాది కళాఖండాలను తిరిగి పొందేందుకు భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, దౌత్య సిబ్బంది సమీకరిస్తున్నారని ఆ ఏకధానాలు పేర్కొంటున్నాయి.
 
అయితే, ప్రభుత్వ వర్గాలు ఆ కథనాలను కొట్టిపారవేశాయి. నివేదికలను ఉదహరించిన వర్గాలు కోహినూర్ గురించి ఎప్పుడూ  ప్రస్తావించలేదని పేర్కొన్నాయి. ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ సంబంధాలకు అనుగుణంగా ద్వైపాక్షిక సహకారం, భాగస్వామ్యం ద్వారా పురాతన వస్తువులను వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించినట్టు వివరించాయి.
 
ఈ ప్రక్రియ గతంలో కూడా అలాగే భారతీయ కళాఖండాలు ఉన్న అనేక దేశాలలో జరుగుతోంది. గతవారం కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేక సమయంలో రాణి కెమిల్లా కిరీటంలో ప్రత్యామ్నాయ వజ్రాలను ఎంచుకున్నప్పటికీ కోహినూర్ అందరి దృష్టిని ఆకర్షించింది. 105 క్యారెట్ల ఈ అరుదైన వజ్రాన్ని పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ ఖజానా నుంచి ఈస్టిండియా కంపెనీ చేజిక్కించుకుంది.
అంతకు ముందు అనేక మంది పాలకుల చేతుల మారింది. పంజాబ్ విలీనమైన తరువాత క్వీన్ విక్టోరియాకు ఈ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు.  డైలీ టెలిగ్రాఫ్ పత్రిక తన నివేదికలో కోహినూర్‌ను తిరిగి తీసుకురావడం భారత ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి అని పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో తమకు చెందిన కళాఖండాలను స్వదేశానికి తీసుకెళ్లేందుకు ఇతర దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
 
గ్రీస్ ఎల్గిన్ మార్బుల్స్, నైజీరియా బెనిన్ కాంస్యాలను కోరింది. స్కాటిష్ నగరంలోని మ్యూజియంలను నిర్వహించే గ్లాస్గో లైఫ్ స్వచ్ఛంద సంస్థ చోరీకి గురైన ఏడు కళాఖండాలను భారతదేశానికి తిరిగి అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ వస్తువులు చాలా వరకు 19వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని దేవాలయాలు, పుణ్యక్షేత్రాల నుంచి దొంగిలించారు.