ఉద్ధ‌వ్ థాక్రేను సీఎంగా పునరుద్ధరించలేం

మ‌హారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్ థాక్రే కు సుప్రీంకోర్టులో ఊర‌ట ద‌క్క‌లేదు. పదవికి థాక్రే రాజీనామా చేశార‌ని, అందుకే ఆయ‌న్ను తిరిగి నియమించలేమని కోర్టు తెలిపింది. అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌కు హాజ‌రుకాకుండానే థాక్రే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని కోర్టు వెల్ల‌డించింది.
 
కాగా, మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక‌నాథ్ షిండేనే సీఎంగా కొన‌సాగుతార‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో శివ‌సేన పార్టీలో చెల‌రేగిన కుమ్ములాట‌కు సుప్రీం తాజా తీర్పుతో థాక్రే వ‌ర్గానికి జ‌ల‌క్ ఇచ్చిన్నట్లయింది. ఆయన అప్పుడే రాజీనామా చేయకుండా ఉండి  పోరాడి ఉంటే అనుకూలంగా తీర్పు వచ్చేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
 
అయితే ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చని పేర్కొంటూనే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది.  అదేవిధంగా గ‌త ఏడాది జూన్‌లో మాజీ సీఎం ఉద్ధ‌వ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌లేమ‌ని సుప్రీంకోర్టు తెలిపింది.

మే 11వ తేదీన సుప్రీంకోర్టులో మహారాష్ట్ర శివసేన సంక్షోభంపై విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దని, దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. గోగావాలేను విప్ గా స్పీకర్ నియమించడం అనైతికమని పేర్కొంది. 

శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్‌ థాక్రే వర్గం, ఏక్ నాథ్ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది.

ఎమ్మెల్యేల మెజారిటీని థాక్రే కోల్పోయార‌ని గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి చేసిన ప్ర‌క‌ట‌న‌ను సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. పార్టీ మాత్రమే విప్ లను నియమిస్తుందని తెలిపింది. చీఫ్‌ విప్‌ నియామకంపై అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌, స్పీకర్‌ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రాజకీయ సంక్షోభం సమయంలో స్పీకర్‌ ఎలాంటి పాత్రను నిర్వహించాలన్న విషయంపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయం తీసుకోబోతుంది.