పాక్ ప్రధాని షరీఫ్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు నిరసనగా ఆ దేశంలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్  పార్టీ శ్రేణులు, ఇమ్రాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. తాజాగా ఈ నిరసనలు ఏకంగా పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటి వరకు చేరాయి.
 
లాహోర్‌లోని పాక్ ప్రధాని షరీఫ్ ఇంటిపై పీటీఐ పార్టీ కార్యకర్తలు కొందరు దాడికి చేశారు. వందలాది మంది ప్రధాని ఇంటి ముందు ఆందోళన చేశారు.
లాహోర్‌లోని మోడల్ టౌన్‍లో ఉన్న ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటి ముందు సుమారు 500 మంది పీటీఐ కార్యకర్తలు ఆందోళన చేశారని పోలీసులు తెలిపారు.
ఆ సమయంలో అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారని వెల్లడించారు.
ఆందోళనకారులు ప్రధాని ఇంటిపైకి పెట్రోల్ బాంబులు సైతం విసిరారని తెలిపారు. “ప్రధాని ఇంటి పరిసరాల్లోకి నిరసనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు” అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రధాని నివాసంపై దాడి జరిగిన సమయంలో అక్కడ గార్డులు మాత్రమే ఉన్నారని పోలీసు అధికారులు చెప్పారు. ఆందోళనకారులు అక్కడే ఉన్న పోలీస్ పోస్టుకు కూడా నిప్పుపెట్టారని తెలిపారు.
అనంతరం పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకారులు పారిపోయారని వెల్లడించారు. ప్రధాన మంత్రి నివాసానికి చేరుకునే ముందు ఆందోళనకారులు మోడల్ టౌన్‍లోనే ఉన్న అధికార పీఎంఎల్-ఎన్ పార్టీ సెక్రటేరియట్‍పై దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. బారియర్లను కూడా కాల్చి వేశారు.

గత రెండు రోజుల్లో ఆందోళనకారులు పంజాబ్‍ (పాకిస్థాన్)లో 14 ప్రభుత్వ భవనాలు, 21 పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారని పోలీసులు వెల్లడించారు. మంగళవారం రోజున లాహోర్‌లో కార్ప్స్ కమాండర్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. కరాచీ, లాహోర్, రావల్పిండి ఇలా పాక్ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్నాయి.