సొంత ఎమ్మెల్యేలపై నమ్మకం లేని సీఎంని ఇక్కడే చూస్తున్నా

ముఖ్యమంత్రికి తన ఎమ్మెల్యేలపై నమ్మకం లేదని, ఇట్లాంటి ప్రభుత్వాన్ని తాను తొలిసారిగా చూస్తున్నానని అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దుమ్మెత్తి పోశారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి గెహ్లాట్‌, కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ మధ్య రాజకీయ వైరం నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

  రాజ్‌సమంద్‌ జిల్లాలోని నాథ్‌ద్వారాలో రూ.5,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తూ రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ పార్టీలోని అంతర్గత కలహాలను విమర్శించారు. ప్రతికూల వ్యక్తులకు దూరదృష్టి ఉండదని, తమ రాజకీయ ప్రయోజనాలకు మించి వారు ఆలోచించలేరని స్పష్టం చేశారు.

తన దాడిని ఉధృతం చేస్తూ ఐదేళ్లుగా రాష్ట్రం చాలా దారుణమైన పతనాన్ని చూసిందని, అభివృద్ధి లేదని ప్రధాని విమర్శించారు. ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతున్నందుకు రాజస్థాన్ ప్రభుత్వంపై కూడా ప్రధాని దాడి చేశారు. 2008 జైపూర్ వరుస పేలుళ్ల నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు.

రాజస్థాన్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడానికి భయపడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కరోనా సమయంలో ప్రజలు చనిపోతున్నా పట్టించుకోలేదని మోదీ కాంగ్రెస్​ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిచోటా అభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల జోలికి పోవద్దని రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు. వైద్య రంగంలో అభివృద్ధి గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ తొమ్మిదేళ్లలో దేశ వ్యాప్తంగా ఆరోగ్య స‌దుపాయాల విష‌యంలో తీవ్ర మార్పు వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఆయుష్మాన్ యోజన దీనికి పెద్దపీట వేసిందని, ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

అనంతరం మాట్లాడిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలని ఆయనను కోరారు.  ‘ఇది జరిగితే అధికార యంత్రాంగం, ప్రతిపక్షం మరింత శక్తితో దేశానికి సేవ చేయగలుగుతాయి. అందుకే ప్రతిపక్షాలను గౌరవించాలి. మీరు (ప్రధానమంత్రి) కూడా ఈ దిశగా పయనిస్తారని నేను భావిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, ప్రజాస్వామ్యంలో శత్రుత్వానికి తావులేదని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పష్టం చేశారు. అన్ని పార్టీలదీ భావజాల పోరాటమని చెబుతూ అందరం కలిసికట్టుగా పని చేస్తేనే దేశం సమైక్యంగా ఉంటుందని తెలిపారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారని గెహ్లాట్‌ గుర్తు చేశారు.