ఇమ్రాన్‌ ఖాన్‌కు 8 రోజుల కస్టడీ.. అగ్రరాజ్యాలు అప్రమత్తం

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆ దేశ అవినీతి నిరోధక కోర్టు 8 రోజులు కస్టడీ విధించింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రశ్నించేందుకు జాతీయ జవాబుదారీ సంస్థ (ఎన్‌ఏబీ) కస్టడీకి అప్పగించింది.  అవినీతి కేసులపై ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రశ్నించేందుకు పది రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్‌ఏబీ కోర్టును కోరింది. అయితే 8 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. ఈ నెల 17న ఇమ్రాన్‌ ఖాన్‌ను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.
 
కాగా, కోర్టు విచారణ సందర్భంగా ఇమ్రాన్‌ ఖాన్‌ పలు ఆరోపణలు చేశారు. మంగళవారం అరెస్ట్‌ చేసిన పోలీసులు తనను వేధించారని కోర్టుకు తెలిపారు. కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు కూడా తనను అనుమతించలేదని విమర్శించారు.  అలాగే నెమ్మెదిగా గుండె పోటు వచ్చే ఇంజెక్షన్‌ తనకు ఇచ్చారని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రభుత్వం, మిలటరీ మధ్య ఇబ్బందులు నెలకొన్న తరుణంలో తాను తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకే తనపై లేనిపోని కేసులు మోపారని ఆయన దుయ్యబట్టారు.
 
ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టుతో పాకిస్థాన్‌ అట్టుడికిపోతున్నది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ  కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. పలుచోట్ల వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.   దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఉన్న తమ పౌరులు, రాయబార సిబ్బందిలకు అమెరికా, యునైటెడ్‌ కింగ్డమ్‌, కెనడాలు హెచ్చరికలు జారీచేశాయి.
జరభద్రంగా ఉండాలంటూ ఆదేశాలు జారీచేశాయి. జనసమ్మర్థం ఉంటే ప్రాంతాలకు వెళ్లకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలని తెలిపాయి.  పాకిస్థాన్‌లోని తమ పౌరులకు యూఎస్‌ ఎంబసీ ట్రావెల్‌ అలర్ట్‌ జారీచేసింది. ఇస్లామాబాద్‌లో నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన నివేదికలను రాయబార కార్యాలయం పరిశీలిస్తున్నదని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆందోళలకు పిలుపునిచ్చారని వెల్లడించింది.
 
ఈ నేపథ్యంలో ఎంబసీకి సంబంధించి అన్నిరకాల అపాయింట్‌మెంట్లను రద్దుచేశామని పేర్కొన్నది. అత్యంత జాగరూకతతో ఉండాలని, రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదని సూచించింది. పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, దీనికోసం స్థానిక వార్తలను చూస్తూ ఉండాలని కోరింది. అత్యవసరమైతే తప్ప ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకూడదని చెప్పింది.
 
ఇదే విధమైన హెచ్చరికలను యూకే ఫారెన్‌ కామన్‌వెల్త్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌ కూడా తమ పౌరులకు జారీచేసింది. దేశవ్యాప్తంగా భారీగా హింస చెలరేగే అవకాశం ఉందని తెలపింది. ఇక కెనడా ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన పౌరులు, దౌత్య సిబ్బందిని కోరింది. ఉగ్రవాదం, మతపరమైన హింస, కిడ్నాప్‌లు జరిగే ముప్పు పొంచిఉందని హెచ్చరించింది.
మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ సన్నిహితుడు, పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీని బుధవారం అరెస్టు చేసినట్లు ఆ దేశ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని కీలక ప్రాంతాల్లో ఆర్మీని మోహరించారు. దేశవ్యాప్తంగా మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించారు. విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయడంతోపాటు స్కూళ్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.