ఉగ్రవాదుల షెల్టర్ జోన్ గా హైదరాబాద్

హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బాంబులపైన హైదరాబాద్ ప్రజలు నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని అంటూ నిన్న అరెస్టయిన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
 
2‌016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయడం లేదని  సంజయ్ ప్రశ్నించారు. ఓటు బ్యాంకు కోసం, అధికారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు.

నిన్న అరెస్ట్ అయిన హిజ్జు ఉత్ తహరీర్ (హెచ్ యు టి) సంస్థ ఉగ్రవాదులు  ఐసిస్ కన్నా ప్రమాదకరం అని సంజయ్ హెచ్చరించారు. రసాయన, జీవ ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం స్రుష్టిస్తున్న సంస్థ. ఒంటరిగానే ఎవరిపైనైనా దాడులు చేసి కలకలం స్రుష్టిస్తున్న సంస్థ ఇది. ఇట్లాంటి ప్రమాదకరమైన సంస్థకు హైదరాబాద్ షెల్టర్ జోన్ గా  మారడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. 
 
పాతబస్తీలో రోహింగ్యాలకు షెల్టర్ జోన్ గా మారిందని తాము అనేక సందర్భాల్లో చెబుతూనే ఉండగా, ఇయాళ నిజమైందని తెలిపారు. నిన్న పట్టుబడ్డ హెచ్ యూటీ ఉగ్రవాది మహ్మద్ సలీం డెక్కన్ మెడికల్ కాలేజీలో హెచ్ ఓడీగా పనిచేస్తున్నడని, ఈ కాలేజీ అధినేత ఒవైసీ అని చెప్పారు.
 
గతంలో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మను 52 సార్లు పొడిచిన ఉగ్రవాదికి హైదరాబాద్ లో షెల్టర్ ఇచ్చారని, పీఎఫ్ఐకి షెల్టర్ జోన్ ఎంఐఎం పార్ అని సంజయ్ ఆరోపించారు. రాజకీయాల కోసం ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంటే, ఓ వర్గం ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎంకు మద్దతిస్తున్నాయిని ధ్వజమెత్తారు.
 
ఈ రెండు పార్టీలకు హైదరాబాద్ ప్రజల భద్రత ముఖ్యం కాదని,  మైనారిటీ ఓట్ల ద్వారా అధికారం పొందాలనుకుంటున్నారే తప్ప శాంతిభద్రతలపట్ల, ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో చిత్తశుద్ధి లేదని ఆయన విమర్సించారు. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన పౌరులు వీసా గడువు ముగిసినా హైదరాబాద్ లోనే మకాం వేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానం ఉందని చెప్పారు.
 
 ఇయాళ హైదరాబాద్ ప్రజలు బాంబుల కింద ఉన్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతూ భాగ్యనగర్ ప్రజల ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నయని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్ యూటీ ఉగ్రవాదులు అనంతగిరి కొండలను శిక్షణా కేంద్రంగా చేసుకున్నరని, డ్రోన్ ద్వారా ఆపరేట్ చేస్తున్నరని హెచ్చరించారు. 
 
ఇన్నాళ్లు లవ్ జిహాద్ అనుకున్నం, ఇప్పుడు కొత్త రకం జిహాద్ నడుస్తోందని అంటూ  హిందూ యువకులను బెదిరించి, మాయమాటలు చెప్పి ముస్లింలుగా మార్చి ఉగ్రవాదులుగా మార్చి హింసకు పాల్పడుతూ హిందువులు కూడా ఉగ్రవాదులేననే ముద్ర వేయాలనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ సహకారంతో టెర్రిరిస్టు సంస్థలు చేస్తున్నట్లు కన్పిస్తోందని సంజయ్ వెల్లడించారు.
 
పాకిస్తాన్ తరువాత ఉగ్రవాదుల అడ్డా హైదరాబాద్ గా మారిందని తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ ఉగ్రవాద కార్యకలాపాలపై సీఎం సమీక్ష చేయాలని, ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తోందెవరు? వారి వెనుకున్న వాళ్లెవరో తేల్చాలని డిమాండ్ చేశారు.